Page Loader
UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు
ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు

UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసే నిరుద్యోగ యువత కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్‌సీ) కీలక మార్పును తీసుకొచ్చింది. తొలిసారిగా ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి, దానిని కొత్త ఆన్‌లైన్‌ దరఖాస్తు పోర్టల్‌తో అనుసంధానించింది. ఈ కొత్త విధానంలో అభ్యర్థులు తమ ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం, ఆధార్‌ సంఖ్య వారిదేనని నిరూపించేందుకు మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ధ్రువీకరించాలి. అలాగే అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియను పూర్తిచేస్తే, తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో మళ్లీ ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు.

Details

 లక్షలాది మంది అభ్యర్థులు ధ్రువీకరణ చేసుకున్నారు

యూపీఎస్‌సీ తెలిపిన ప్రకారం, ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమే అయినా... ఇప్పటికే లక్షల మంది అభ్యర్థులు ముందుకొచ్చి ఆధార్‌ ధ్రువీకరణ చేసుకున్నారు. గతనెల 28న ప్రారంభించిన కొత్త పోర్టల్‌లో ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది తమ ఆధార్‌ ఆధారిత రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు.

Details

 ఎందుకు ఈ విధానం?

ఈ కొత్త విధానం వెనక కారణం 2022లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక వివాదమే. మహారాష్ట్ర పుణెలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారి పూజా ఖేడ్కర్‌ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రకారం - తల్లిదండ్రుల పేర్లను మార్చడం, తక్కువ ఆదాయం చూపించి రిజర్వేషన్ పొందడం, వైకల్యం ఉందని తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా సివిల్స్‌ పరీక్షలు పునరావృతంగా రాసి చివరికి ఐఏఎస్‌ పోస్టును సంపాదించారని సమాచారం. అనంతరం జరిగిన విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలిన నేపథ్యంలో ఆమెను సర్వీస్‌ నుంచి తొలగించింది. కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి అక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా నిరోధించడమే యూపీఎస్‌సీ తీసుకున్న ఆధార్‌ ధ్రువీకరణ నిర్ణయం వెనకున్న ముఖ్య ఉద్దేశం.

 Details

అభ్యర్థులకు ఉపయోగాలే ఎక్కువ 

ఈ ఆధార్‌ ఆధారిత కొత్త విధానంలో దరఖాస్తు ప్రక్రియ నాలుగు ప్రధాన దశలుగా విభజించారు. ఖాతా సృష్టి, రిజిస్ట్రేషన్‌, కామన్‌ అప్లికేషన్‌ ఫారం నింపడం, ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు. ఇందులో మొదటి మూడు దశలు ఒకేసారి పూర్తిచేస్తే చాలు. భవిష్యత్తులో ఏ పరీక్షకైనా దరఖాస్తు చేయాల్సినప్పుడు కేవలం చివరి దశను మాత్రమే పూర్తిచేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల అభ్యర్థులు ప్రతి పరీక్షకు అన్ని వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. కొద్ది నిమిషాల్లోనే యూపీఎస్‌సీ నిర్వహించే ఏ పరీక్షకైనా దరఖాస్తు చేయొచ్చు.

Details

సులువుగా దరఖాస్తులు

యూపీఎస్‌సీ ప్రతీ ఏటా సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీసెస్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ‌, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తోంది. వీటికి లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తారు. ఆధార్‌ ధ్రువీకరణ విధానం అమల్లోకి రావడం వల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరమవుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సివిల్స్‌ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు.