
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల .. టాప్-10 ర్యాంకర్లు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
అఖిల భారత సివిల్ సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్- 2024 తుది ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గొప్ప ప్రతిభను ప్రదర్శించి దేశవ్యాప్తంగా తమ సామర్థ్యాన్ని చాటారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టాప్ 10లో నిలిచిన అభ్యర్థుల్లో శక్తి దుబే మొదటి ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
ఆమె తర్వాతి స్థానాల్లో హర్షిత గోయల్ (2వ ర్యాంకు),అర్చిత్ పరాగ్ (3),షా మార్గి చిరాగ్ (4),ఆకాశ్ గార్గ్ (5),కోమల్ పునియా (6),ఆయుషీ బన్సల్ (7),రాజ్‌కృష్ణ ఝా (8),ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి (10)వరుసగా నిలిచారు.
వివరాలు
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈసారి UPSC ఫలితాల్లో తాము ఎంత ముందున్నామో చూపించారు.
ముఖ్యంగా ఇ.సాయి శివాని 11వ ర్యాంకుతో గర్వించదగిన స్థాయిలో నిలిచారు.
అలాగే బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించగా, అభిషేక్ శర్మ 38వ స్థానంలో నిలిచారు.
ఈ లిస్ట్‌లో రావుల జయసింహారెడ్డి (46), శ్రవణ్‌కుమార్ రెడ్డి (62), సాయి చైతన్య జాదవ్ (68), ఎన్.చేతనరెడ్డి (110), చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి (119), చల్లా పవన్ కల్యాణ్ (146), ఎన్.శ్రీకాంత్ రెడ్డి (151), నెల్లూరు సాయితేజ (154), కొలిపాక శ్రీకృష్ణసాయి (190) వంటి అభ్యర్థులు ర్యాంకులతో మెరిశారు.
వివరాలు
ఈసారి UPSC ద్వారా మొత్తం 1,056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఈసారి UPSC ద్వారా మొత్తం 1,056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 2023 ఫిబ్రవరిలో విడుదలైంది.
ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కీలక సర్వీసులకు భర్తీ జరుగుతుంది.
జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, అర్హత సాధించిన అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.
మెయిన్స్‌లో మెరుగైన ప్రతిభను కనబరిచిన అభ్యర్థుల కోసం జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు.
వీటి ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించారు. మొత్తం 1,009 మందిని ఐఏఎస్,ఐఎఫ్‌ఎస్,ఐపీఎస్ తదితర సర్వీసులకు ఎంపిక చేశారు.
వివరాలు
యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో 15రోజుల్లో అందుబాటులోకి
వీరిలో జనరల్ కేటగిరీకి చెందిన వారు 335 మంది,ఈడబ్ల్యూఎస్‌కి చెందిన వారు 109మంది,ఓబీసీ 318 మంది,ఎస్సీ 160మంది,ఎస్టీ 87మంది ఉన్నారు. అదనంగా 230 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచినట్లు UPSC వెల్లడించింది.
ఈఫలితాలపై మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే అభ్యర్థుల కోసం యూపీఎస్సీ తన కార్యాలయంలోని పరీక్షా హాల్ వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది.
అభ్యర్థులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో స్వయంగా వచ్చి సమాచారం పొందవచ్చు లేదా 23385271, 23381125, 23098543 అనే ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో వచ్చే 15రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ మేరకు అధికారికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.