Pooja Khedkar:నన్ను అనర్హులుగా ప్రకటించే అధికారం UPSCకి లేదు: పూజా ఖేద్కర్
అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ కేసులో ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌పేరు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె కేసు దిల్లీ హైకోర్టులో ఉంది. కోర్టు విచారణలో యూపీఎస్సీ చేసిన ఆరోపణలను పూజ ఖండించారు. తాను ఎటువంటి ఫోర్జరీ పత్రాలను సమర్పించలేదని ఆమె వాదించారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటు వేయడానికి అధికారం లేదని, ''అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే హక్కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కు మాత్రమే ఉంది'' అని పూజ కోర్టులో వాదించారు. పూజా ఖేద్కర్ పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో, ఆమెపై అధికార దుర్వినియోగం,యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.
హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన పూజా ఖేద్కర్
ఈ అంశంపై దర్యాప్తు చేసిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను పాస్ చేసిందని గుర్తించిన యూపీఎస్సీ, ఆమెకు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపింది. దీంతోపాటు, ఫోర్జరీ కేసు నమోదు చేసి, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.ఈ నిర్ణయంపై ఆమె హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ పూజ కోర్టును అభ్యర్థించగా, ఆమెకు ఆగస్టు 29 వరకు రక్షణ లభించింది. ఇటీవల ఈ కేసులో కోర్టు విచారణ కొనసాగింది.