
Thurakapalem: తురకపాలెం పరిసరాల్లో యూరేనియం గుర్తింపు.. భయాందోళనలో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు జిల్లా తురకపాలెంలో ఉధృతంగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు కారణం యురేనియం అవశేషాలు కలిసిన నీరే అని అధికారుల అధ్యయనంలో తేలింది. ఈ గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై ప్రయోగశాల, ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ల్యాబ్‌లకు పరీక్ష కోసం పంపించారు. శనివారం చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులో తురకపాలెం పరిసరాల్లోని జలాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తేలింది. గ్రామం చుట్టూ ఉన్న రాళ్ల క్వారీలు, వాటిలో పనిచేసే స్థానికులు, అలాగే క్వారీ గుంతల్లోని నీటిని ఉపయోగించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్లు అధికారులు నిర్ధారించారు.
Details
యురేనియం శరీరానికి అత్యంత హానికరం
అంతేకాకుండా నీటిలో స్ట్రాన్షియం అనే మూలకం, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు వైద్య బృందం గుర్తించింది. అయితే మొదట తురకపాలెంలో సేకరించిన నీటి నమూనాల పరీక్షల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెప్పగా, చెన్నై రిపోర్టులో మాత్రం విభిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. యురేనియం మానవ శరీరానికి అత్యంత హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాగునీరు, ఆహారం ద్వారా ఈ అవశేషాలు శరీరంలోకి ప్రవేశిస్తే ముందుగా మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. అదేవిధంగా చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అలాగే కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను దెబ్బతీసి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేశారు.