LOADING...
Air India victims: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: పరిహారం జాప్యంపై బాధిత కుటుంబాల ఆవేదన
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: పరిహారం జాప్యంపై బాధిత కుటుంబాల ఆవేదన

Air India victims: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: పరిహారం జాప్యంపై బాధిత కుటుంబాల ఆవేదన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్‌కు చెందిన AI171 విమాన ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా లీడ్ లాయర్ మైక్ ఆండ్ర్యూస్, ప్రమాదం జరిగిన ఐదు నెలలు గడిచినా ఇప్పటికీ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. బాధిత కుటుంబాలు మానసికంగా తీవ్రమైన వేదన అనుభవిస్తున్నాయని, అలాగే దర్యాప్తులో కీలక సాంకేతిక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గురైన 130కుపైగా కుటుంబాలు ఇప్పటికే సమిష్టిగా లీగల్ పోరాటంలో చేరినట్లు తెలిపారు. రోజురోజుకు తమ జీవితాల్లో సాధారణ పరిస్థితులకు అలవాటు పడటం కుటుంబాలకు పెద్ద పోరాటంగా మారిందని, ఆర్థిక నష్టం కనిపిస్తున్నా మానసిక గాయాలు, దీర్ఘకాలిక మానసిక ప్రభావాలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

ఎలక్ట్రానిక్ భాగాలు ఉన్న విభాగాల్లో నీటి లీకులు

యూకేలోని ఓ కుటుంబం ఆదాయం తెచ్చే వ్యక్తిని కోల్పోయి ఇల్లు మార్చుకోవాల్సి వచ్చిందని, కుటుంబ భారం మోయడానికి ముగ్గురు పిల్లలు చదువు మానేసిన ఉదాహరణను చెప్పారు. సాంకేతిక దర్యాప్తు విషయంలో విమాన డేటా, ఎలక్ట్రికల్ వ్యవస్థలు తదితర అంశాలను విమాన నిపుణుల సహాయంతో పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి ముందు క్షణాల్లో లైట్లు తొలగిపోవడం, ఎమర్జెన్సీ పవర్ వ్యవస్థ పనిచేయడం, రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) పనిచేయడం వంటి సూచనలు పెద్ద స్థాయి ఎలక్ట్రికల్ లేదా హైడ్రాలిక్ వైఫల్యాన్ని చూపిస్తున్నాయన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ భాగాలు ఉన్న విభాగాల్లో నీటి లీకులు ఉండటం వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

వివరాలు 

డాక్యుమెంట్లు, బ్యూరోక్రటిక్ ప్రక్రియల వల్ల పరిహారం జాప్యం

భారతీయ AAIB దర్యాప్తు అధికారులు అమెరికా వాషింగ్టన్ డీసీలోని NTSB అధికారులను కలవడానికి వెళ్లనున్నట్లు వార్తలు రావడం ఇప్పటివరకు లభించిన వివరాలు ఎంతో కీలకంగా ఉన్నాయన్న సంకేతమని అన్నారు. భారత్,యూకే పర్యటనల్లో తమ లీగల్ బృందం బాధిత కుటుంబాలను కలసి పరిహారం,పత్రాల జాప్యం, వ్యక్తిగత వస్తువుల రాబడి అంశాలపై మాట్లాడినట్లు తెలిపారు. ప్రకటించిన రూ.1 కోటి తాత్కాలిక పరిహారం ఇప్పటివరకు కొద్ది కుటుంబాలకు మాత్రమే అందిందని, డాక్యుమెంట్లు, బ్యూరోక్రటిక్ ప్రక్రియల వల్ల జాప్యం జరుగుతోందని వివరించారు. భవిష్యత్తులో బోయింగ్,జీఈ తదితర సంస్థలపై బాధ్యత నుంచి విడుదల చేస్తూ పత్రాలపై సంతకం చేయమని కుటుంబాలను కోరుతున్నారన్న వార్తలపై స్పందించిన ఆండ్ర్యూస్, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి పత్రాలపై సంతకం చేయవద్దని తాము సూచించినట్లు చెప్పారు.

Advertisement

వివరాలు 

ప్రమాదంలో అన్ని వర్గాల కుటుంబాలు ఇప్పటికీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి 

అసలు ప్రమాదానికి గల నిజమైన కారణం తేలకముందే ఎవరిపై బాధ్యత నిర్ణయించడం తగదని, అది పూర్తిగా అనుచితమని ఆయన స్పష్టం చేశారు. ఎంత పెద్ద మొత్తంలో పరిహారం ఇచ్చినా మనిషి ప్రాణ విలువకు సరిపోదని, అన్ని వర్గాల కుటుంబాలు ఇప్పటికీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. సంఘటన స్థలం నుంచి లభించిన వ్యక్తిగత వస్తువుల్లో గుర్తించగలిగిన వాటిని త్వరగా అందజేసే అవకాశం ఉందని, మిగతావి గుర్తింపు ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. సాధారణంగా విమానయాన సంస్థలు ఈ పనుల కోసం ప్రైవేట్ ఏజెన్సీలను నియమిస్తాయని వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్న ఈ సమయంలో ఎయిర్ ఇండియా బాధిత కుటుంబాల పక్కనే నిలబడాలని ఆయన కోరారు.

Advertisement

వివరాలు 

టేకాఫ్ అయ్యి కేవలం 90 సెకన్లలోనే ప్రమాదం 

జూన్ 12న అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే AI171 విమానం కూలి 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, జనావాసాలపై కూలి ఉన్న మరో 19మందితో కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో, టేకాఫ్ అయ్యి కేవలం 90 సెకన్లలోనే జరిగిన భయానక ఘటనల్ని వివరించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే పైకి ఎగురుతుండగా అకస్మాత్తుగా రెండు ఇంజిన్లు పనిచేయడం ఆగిపోవడంతో శక్తి పూర్తిగా తగ్గిపోయి, అదుపు తప్పిన విమానం వేగంగా కూలిపోయిందని నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదం ఇటీవలి కాలంలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.

Advertisement