
Tirupati: తిరుపతి జిల్లాలో ఐటీ పార్కుకు ప్రవాసుల శ్రీకారం.. యువతకు శిక్షణ.. ఉపాధి కల్పన లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో అమెరికాలో స్థిరపడ్డ భారతీయ ఐటీ, ఆర్థిక రంగ నిపుణులు ముందుకు వచ్చారు. రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన సుమారు 20 మంది తెలుగు ప్రవాసులు, తమ స్వస్థలంపై మమకారంతో తిరుపతి జిల్లాలో ఐటీ పార్కు నిర్మాణానికి సిద్ధమయ్యారు. 'పెలికాన్ వ్యాలీ' పేరుతో రూపుదిద్దుకోబోయే ఈ ప్రాజెక్ట్ కోసం వారు సొంతంగా సుమారు రూ.250 కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు. దొరవారిసత్రం సమీపంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కొనుగోలు చేశారు. 2026 నాటికి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వి.రావు తెలిపారు.
వివరాలు
రెండు దశల్లో కలిపి మొత్తం 50 ఎకరాల్లో విస్తరించాలనే లక్ష్యం
పార్కు ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం సంబంధిత శాఖలకు ఇప్పటికే దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు "వాక్ టు వర్క్" విధానాన్ని అనుసరించి ఈ ఐటీ పార్కును అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉందని ఆయన వివరించారు. ప్రాజెక్టు ప్రమోటర్ వాణి కూనిశెట్టి మాట్లాడుతూ, ఈ ఐటీ పార్కును రెండు దశల్లో కలిపి మొత్తం 50 ఎకరాల్లో విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. పక్షుల సంరక్షణ కేంద్రం సమీపంలో పార్కు నిర్మాణం జరుగుతున్నందునే దానికి 'పెలికాన్ వ్యాలీ' అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఆమె అమెరికాలో 'ఎఫెక్‌సాఫ్ట్' కంపెనీని నిర్వహించడమే కాకుండా, న్యూజెర్సీలోని తెలుగు కళాసమితిలో ఖజాంచీగా కూడా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
తమ ప్రాంతానికి సేవ చేయాలనే..
ప్రతీ సంవత్సరం రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల నుంచి సుమారు 2.5లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. అయితే వారిలో గణనీయమైన సంఖ్యలో యువత ఆంగ్ల భాషా పట్టు,కమ్యూనికేషన్ నైపుణ్యాల లోపం కారణంగా సరైన ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అమెరికా ప్రవాసులు స్వంత నిధులతో ఐటీ పార్కు నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. వారు ఒక సమూహంగా ఏర్పడి సాంకేతికత,ఆవిష్కరణ,ఉపాధి కలయికతో కూడిన ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ నిర్మించాలని నిర్ణయించారు. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారికి తగిన ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అమెరికాలోని వివిధ కంపెనీల ప్రాజెక్టులను భారత్‌కు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే వారి లక్ష్యం.
వివరాలు
ఆన్‌లైన్‌లోనే శిక్షణ ప్రారంభం
ఐటీ పార్కు నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. 'సైకోమెట్రిక్ అసెస్‌మెంట్' పేరుతో 100 ప్రశ్నల పరీక్ష ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి, వారికి సరిపడే శిక్షణ మాడ్యూల్‌ను నిపుణులు నిర్ణయిస్తారు. ఈ పరీక్ష నిర్వహించే థర్డ్ పార్టీ సంస్థకు అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేషన్‌తో పాటు ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధమవ్వాలో కూడా శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు ఉద్యోగం పొందిన తరువాత మాత్రమే కోర్సు ఫీజుగా రూ.1.80 లక్షలను వాయిదాల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించారు. శిక్షణ కోసం ప్రత్యేక కరిక్యులమ్‌ను నిపుణుల బృందం సిద్ధం చేసింది.
వివరాలు
ఆన్‌లైన్‌లోనే శిక్షణ ప్రారంభం
హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేయలేని విద్యార్థులకు ఈ ఆన్‌లైన్ శిక్షణ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్‌ఆర్‌ఐ బృందం తెలిపింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో, అలాగే చెన్నైలో ఉన్న నిపుణులతో కలిపి 100 మందికి పైగా ప్రొఫెషనల్స్ ఈ శిక్షణలో భాగమవుతున్నారు. శిక్షణలో చేరాలనుకునే వారు www.pelicanvalley.net లేదా placement@pelicanvalley.net ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
వివరాలు
ఐటీ పార్క్ లక్ష్యాలు
పెద్ద నగరాల వాతావరణం కాకుండానే పట్టణ స్థాయి అవకాశాలను చిన్న పట్టణాల్లో అందించడం. ఉద్యోగుల ప్రయాణ సమయం, ఖర్చు, ఒత్తిడి తగ్గించడంతో పాటు, వారి పనిలో నైపుణ్యం, జీవన సమతుల్యత పెంపొందించడం. చిన్న పట్టణాల్లో ఉపాధి సృష్టించడం ద్వారా యువతను మెట్రో స్థాయి పోటీకి సిద్ధం చేయడం. నిపుణుల శిక్షణ ద్వారా నిరుద్యోగుల ఆదాయ సామర్థ్యాన్ని పెంచడం. ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధంగా ఉండే సేల్స్‌ఫోర్స్ నిపుణులుగా తీర్చిదిద్దడం. సాఫ్ట్ స్కిల్స్ నేర్పడం ద్వారా వ్యక్తిత్వ అభివృద్ధికి దోహదం చేయడం. క్యాంపస్ నియామక డ్రైవ్‌ల కోసం వివిధ భాగస్వామ్య కంపెనీలను ఆహ్వానించడం.