 
                                                                                Deportation: 2025లో అమెరికా 2,790 మంది భారతీయులను బహిష్కరించింది: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై ఉక్కుపాదం మోపే చర్యలను వేగవంతం చేశారు. చట్టవ్యతిరేకంగా అమెరికా భూభాగంలో ఉన్న ఇతర దేశాల పౌరులను గుర్తించి, ప్రత్యేక విమానాల ద్వారా వారిని తమ స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వేలాదిమందిని బహిష్కరించిన ట్రంప్ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు 2,790 మందికిపైగా భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.
వివరాలు
ఈ ఏడాది తిరిగొచ్చిన దాదాపు 100మంది భారతీయ పౌరులు
"ఈ కాలంలో అమెరికాలో చట్టబద్ధమైన నివాస అర్హతలు లేని 2,790 మందికిపైగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు అక్కడ చట్టవ్యతిరేకంగా నివసిస్తున్నారు. వారి గుర్తింపును, పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ తర్వాత అమెరికా అధికారులు వారిని బహిష్కరించారు," అని ఆయన తెలిపారు. జైస్వాల్ ఇంకా వివరిస్తూ, బహిష్కరణ ప్రక్రియ అంతా భారత్-అమెరికా మధ్య అమల్లో ఉన్న చట్టపరమైన,దౌత్య ప్రోటోకాల్‌లను అనుసరించి జరిగిందని తెలిపారు. అలాగే అమెరికా మాత్రమే కాకుండా,యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుంచి కూడా ఈ ఏడాది కొంతమంది భారతీయులను బహిష్కరించినట్లు వెల్లడించారు."యూకే నుంచి ఈ ఏడాది దాదాపు 100మంది భారతీయ పౌరులు తిరిగి పంపించారు.వారందరి పౌరసత్వ వివరాలు ధ్రువీకరించిన తర్వాతే ఆ చర్యలు చేపట్టారు," అని ఆయన చెప్పారు.
వివరాలు
62 శాతం తగ్గిన అక్రమ ప్రవేశాల సంఖ్య
ఇక, అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత నాలుగేళ్లలో ఇది కనిష్ట స్థాయికి చేరింది. అక్టోబర్ 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు అనుమతి లేకుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించిన 34,146 మంది భారతీయులను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సంఖ్య 90,415 మందిగా నమోదైంది. ఈ లెక్కన అక్రమ ప్రవేశాల సంఖ్య సుమారు 62 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది.