'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక విడుదల చేసింది. 2022లో భారతదేశంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలను జరిగినట్లు ఆ వార్షిక నివేదికలో పేర్కొంది. 2022లో భారతదేశంలో అక్రమ అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛ, మత, జాతి పరంగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడుల అంశాలను అమెరికా తన నివేదికలో చెప్పింది. ఈ నివేదికను అమెరికా రక్షణమంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు. హత్యలతో పాటు జైలు, పోలీసు స్టేషన్లలో చిత్ర హింసలు, అధికారులు కించపర్చేలా మాట్లడటం వంటి ఘటనలు జరిగినట్లు నివేదిక చెబుతోంది. ముఖ్యంగా కొన్ని జైళ్ల వాతావరణంలో ప్రాణాంతక పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పింది. నిర్బంధం, రాజకీయ ఖైదీల విషయంలో యంత్రాంగ ఏకపక్షంగా వ్వవహరించినట్లు అమెరికా నివేదక వెల్లడించింది.
భావప్రకటన, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు: నివేదిక
భావప్రకటన, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు, హింసాత్మక, అన్యాయంగా జర్నలిస్టులను అరెస్టు చేయడం లాంటి ఘటనలు జరిగినట్లు నివేదికలో పొందుపర్చింది. నేరపూరిత అపవాదు చట్టాలను అమలు చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించింది. గతంలోనూ అమెరికా ఇలాంటి నివేదికలను విడుదల చేసింది. భారత్ ఆ నివేదికలను తిరస్కరించింది. అందరి హక్కులను కాపాడేందుకు భారతదేశం ప్రజాస్వామ్య పద్ధతులను, పటిష్టమైన సంస్థలను కలిగి ఉందని నొక్కిచెప్పింది. భారతదేశంలోని తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలలో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛలో జోక్యం, దేశీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలపై వేధింపులను కూడా అమెరికా తన నివేదికలో ప్రస్తావించింది. గృహ, లైంగిక హింస, బాల్య వివాహాలు, స్త్రీ హత్యలకు సంబంధించి విచారణ లేకపోవడం వంటి అంశాలను నివేదికలో పొందుపర్చింది.