యూపీలో ఘోరం.. విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి, గ్యాంగ్ రేప్ చేస్తూ వీడియో తీశారు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కళాశాల విద్యార్థిని అడ్డగించిన కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు. ఆపై అత్యాచారం చేశారు. అనంతరం పైశాచికత్వంతో ఆయా దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఫతేపూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్ 1న కాలేజీ అయిపోయాక ఓ విద్యార్థిని తిరిగి ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలోనే ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ బాధితురాలికి డ్రగ్స్ ను ఇంజెక్ట్ చేశారు. మత్తులోకి జారుకున్న ఆమెపై పైశాచికంగా సామూహికంగా లైంగిక దాడికి ఒడిగట్టారు.
యువతికి వైద్య పరీక్షలు
ఈ క్రమంలో ఆయా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో అత్యాచారం ఘటనను రికార్డు చేశారు. అనంతరం సమాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో అటు ఇటు వైరల్ అయిన ఈ వీడియో, మూడు రోజుల తర్వాత బాధిత యువతికి తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తండ్రితో కలిసి బాధితురాలు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కళాశాల అయిపోయాక ఇంటికి వస్తున్న క్రమంలో కొందరు తనను లాక్కెళ్లారని, డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో ఒక వ్యక్తిని గుర్తించిన విద్యార్థిని, గ్రామ పెద్దకు చెందిన బంధువని చెప్పారు. మరోవైపు యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.