ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. సిలిండర్ పేలడం వల్లే ఈ పేలుడు సంభవించొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంఘటనా స్థలంలో పలు సిలిండర్లు లభ్యం
కొత్వాలి నగర్ ప్రాంతంలోని నయాగావ్‌లోని పొలాల మధ్యలో నిర్మించిన ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించినట్లు మధ్యాహ్నం కాల్ వచ్చిందని ఎస్‌ఎస్‌పీ శ్లోక్ కుమార్ పేర్కొన్నారు. బాధితులను అభిషేక్ (20), రయీస్ (40), ఆహద్ (05), వినోద్‌గా గుర్తించారు. పేలుడు జరిగిన ఇంటిని బాధితులు అద్దెకు తీసుకున్నారు. ఘటనా స్థలంలో మరికొన్ని సిలిండర్లు కూడా లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక దళం, సీఎంఓ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. పేలుడుకు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ యూనిట్‌ను కూడా యంత్రాంగం రంగంలోకి దిగింది.