ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు
ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షి కావడం గమనార్హం. ఈ కేసులో అతిక్ సోదరుడు అష్రఫ్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి సోమవారం 24గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ జైలుకు తీసుకువచ్చారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కూడా అహ్మద్ నిందితుడు.
ఉమేష్ పాల్ హత్య కేసులో కూడా అతిక్ నిందితుడు
రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో కూడా అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2005 జనవరి 25న ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ ఫిబ్రవరి 28, 2006న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆ సమయంలో ఉమేష్ పాల్‌ను అతిక్ అహ్మద్ అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమేష్ పాల్ జులై 2007లో ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితులు అతిక్ అహ్మద్, అష్రఫ్, ఫర్హాన్ ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.