UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్లు, 4ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను తమ సొంత అక్క(18ఏళ్లు) కిరాతకంగా హత్య చేసింది. ఇద్దరు చిన్నారుల తలలను వేరు చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది. మృతులను జైవీర్ సింగ్ కుమార్తెలు సుర్భి, రోష్ణిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జంట హత్యలు జరిగిన కొన్ని గంటలకే నిందితురాలైన అంజలి పాల్ (18)ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఆమెకు సహకరించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసుల వద్ద అంజలి హైడ్రామా
అంజలి తన ఇద్దరు చెల్లెళ్లను హత్య చేసిన తర్వాత కొద్ది సేపు హైడ్రామా నడిపించింది. తన ఇద్దరు చెల్లెళ్లు హత్యకు గురైనట్లు పోలీసులకు మొదట అంజలినే పోలీసులకు సమాచారం ఇచ్చింది. తాను ఇంటికి వచ్చే సరికి, ఒక గదిలో తన సోదరీమణుల మృతదేహాలు, మరొక గదిలో వారి తలలు కనిపించాయని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే ఇంటి పరిసరాలను గమనించిన పోలీసులకు శుభ్రం చేసిన పలుగు, బయట ఆరబెట్టిన బట్టలను చూసిన తర్వాత ఇది ఇంట్లోవాళ్లే చేసినట్లు అనుమానించారు. పలుగు, బట్టలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా, వాటిపై చిన్నారుల రక్తపు గుర్తులు ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు అంజలిని తమదైన శైలిలో విచారించగా, చివరికి తానే హత్యలు చేసినట్లు ఒప్పుకుంది.
హత్య ఇంట్లో లేని తల్లిదండ్రులు
అంజలి కూడా నేరాన్ని అంగీకరించినట్లు కాన్పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ హత్యలు జరిగిన సమయంలో జైవీర్, అతని భార్య సుశీల, వారి కుమారులు నంద్ కిషోర్ (12), కన్హయ్య (8) ఇంట్లో లేరని తెలిపారు. పోలీసులు విచారించినప్పుడు నిందితురాలు అంజలి పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విచారణకు నేతృత్వం వహిస్తున్న ఐజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించి నిందితురాలతో పాటు మరో ముగ్గురు పురుషులను పోలీసులు ప్రశ్నించారు. పూర్తిస్తాయిలో విచారించిన తర్వాత హత్య వెనుక గల కారణాలను వెల్లడిస్తామని ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) సంజయ్ వర్మ పేర్కొన్నారు.