Page Loader
Uttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం
చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం

Uttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్'లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్'కు మరో అవాంతరం ఎదురైంది. ఈ మేరకు వారిని సురక్షితంగా ఉపరితలానికి తీసుకొచ్చేందుకు గత 12 రోజుల నుంచి నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రెస్యూ ప్రక్రియను రెండు సార్లు నిలపాల్సి వచ్చింది. ఈ తరుణంలో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. అయితే శుక్రవారం సాయంత్రం లేదా శనివారం వరకు 41 మంది కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.

details

శుక్ర, శనివారాల్లో బయటకు రానున్న కార్మికులు

ఓవైపు గురువారం రాత్రి వరకే సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చేస్తారని అధికార యంత్రాంగం పూర్తి విశ్వాసంతో ఉంది. కానీ మరోసారి రెస్క్యూ పనులకు ఆటంకం ఏర్పడింది. గుర్తు తెలియని ఇనుప పట్టీ ఒకటి అడ్డు తగలడంతో డ్రిల్లింగ్‌‌ ఆగిపోయింది. గ్యాస్‌కట్టర్‌తో దాన్ని తొలగించాక మళ్లీ డ్రిల్లింగ్‌ పనులు కొనసాగాయి. సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు దాదాపుగా పూర్తయ్యాయి. 25 టన్నుల భారీ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉంచిన వేదికకు గురువారం రాత్రి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.