Vaishno Devi: వైష్ణో దేవి ఆలయంలో వెండి పేరుతో మోసం.. 95% నకిలీ, క్యాడ్మియంతో క్యాన్సర్ ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు సమర్పించే వెండిలో అసలు వెండి చాలా తక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ మింట్ అధికారులు గుర్తించారు. ఆలయం నుంచి సుమారు 20 టన్నుల వెండి కానుకలను కరిగించడానికి పంపించగా, వాటిలో కేవలం 5-6 శాతం మాత్రమే నిజమైన వెండి ఉండగా, మిగతాది క్యాడ్మియం, ఇనుము వంటి తక్కువ ధరలో లభించే లోహాలుగా తేలింది. దీంతో రూ.500 కోట్లకు పైగా విలువ ఉంటుందని భావించిన వెండి, వాస్తవానికి కేవలం రూ.30 కోట్ల విలువకే పరిమితమైందని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
స్థానిక వ్యాపారులపైనే అనుమానం
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వెండిలా కనిపించే క్యాడ్మియం లోహం కేవలం రూ.400-500 కిలో ధర మాత్రమే ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది కరిగించే సమయంలో వెలువడే వాయువులు క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా భారత ప్రమాణాల ప్రకారం వినియోగ వస్తువుల్లో క్యాడ్మియం వినియోగం నిషేదించారు. ఈ కల్తీ వ్యవహారం ప్రధానంగా వైష్ణో దేవి ప్రాంతంలోనే జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. తిరుపతి, సిద్ధివినాయక ఆలయం, గురువాయూర్ దేవస్వం, శ్రీకాళహస్తి ఆలయం వంటి ఇతర ఆలయాల్లో ఇలాంటి ఘటనలు నమోదు కాలేదని సమాచారం. దీంతో భక్తులకు వెండి వస్తువులు అమ్మే స్థానిక వ్యాపారులపైనే అనుమానం వ్యక్తమవుతోంది.
వివరాలు
70కిలోల వెండి కానుకల్లో కేవలం 3కిలోల మాత్రమే అసలు వెండి
ఈ విషయం పై మింట్ అధికారులు పలుమార్లు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయానికి,అలాగే ఆలయ బోర్డుకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. భక్తులు మోసపోతున్నారని,క్యాడ్మియం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించినా స్పందన రాలేదని సమాచారం. మింట్‌లో జరిగిన పరీక్షల్లో 70కిలోల వెండి కానుకల్లో కేవలం 3కిలోల మాత్రమే అసలు వెండి ఉన్నట్లు బయటపడింది. ఈకల్తీ పదార్థాన్ని వేరు చేయడానికి సిబ్బంది దాదాపు మూడు నెలలు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. క్యాడ్మియం వల్ల వచ్చే విషపూరిత వాయువుల కారణంగా మొదట మింట్ ఈ పదార్థాన్ని ప్రాసెస్ చేయడానికే నిరాకరించినా,ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని,ఆధునిక పరికరాలతో చివరకు పనిని పూర్తి చేసినట్లు వెల్లడించారు.