Vandemataram: ప్రభుత్వ కార్యక్రమాలు,పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలి: కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా, పౌర పురస్కారాల ప్రదానోత్సవాలు, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా వందేమాతరం ఆలపించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే, సినిమా థియేటర్లలో ఈ గేయాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని నిబంధనల్లో స్పష్టం చేసింది.
వివరాలు
వందేమాతరం' 150వ వార్షికోత్సవాలు
జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం, బాధ్యులపై గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా, వందేమాతరం గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875లో తొలిసారిగా రచించారు. అనంతరం తన ప్రసిద్ధ నవల 'ఆనంద్‌మఠ్'లో దీనిని భాగంగా చేర్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
వివరాలు
వందేమాతరంలోని ఆరు చరణాలు ఆలపించాలి
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలని కేంద్రం సూచించింది. అయితే స్వాతంత్ర్య పోరాట కాలంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల నేపథ్యంలో, ఆరు చరణాల్లో మతపరమైన సూచనలు లేని మొదటి రెండు చరణాలను మాత్రమే కాంగ్రెస్ స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం, వివాదాలకు తావులేని తొలి రెండు భాగాలతోనే వందేమాతరాన్ని జాతీయ గేయంగా నెహ్రూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.