Loading...
Veligonda Phase-1: వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల
వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల

Veligonda Phase-1: వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కాపురం ప్రాంత ప్రజలు, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, తగ్గిపోతున్న భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఊరటనివ్వనుంది. మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో మార్కాపురం ప్రాంతంతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు కొత్త ఆశలు చిగురించనున్నాయి.

వివరాలు 

1.19 లక్షల ఎకరాలకు సాగునీరు.. నాలుగు లక్షల మంది ప్రజలకు తాగునీటి సదుపాయం

తొలి దశలో భాగంగా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి నిల్వ చేయనున్నారు.

మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు నాలుగు లక్షల మంది ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను గ్రావిటీ విధానంలో తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేస్తారు.

అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు నీటిని వినియోగించేలా ప్రాజెక్టును రూపొందించారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

వివరాలు 

30 ఏళ్ల క్రితం శంకుస్థాపన.. ఇప్పుడు ప్రారంభం కూడా చంద్రబాబే

వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే శంకుస్థాపన చేశారు.

సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత ఆయన పాలనలోనే ప్రాజెక్టు తొలి దశ పూర్తై కృష్ణా జలాల విడుదలకు సిద్ధమవడం ప్రత్యేకత సంతరించుకుంది.

ఈ 30 ఏళ్లలో ప్రాజెక్టు ఎన్నో సాంకేతిక,ఆర్థిక,నిర్మాణపరమైన సవాళ్లను ఎదుర్కొంది.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా పరిగణించి పనులను వేగవంతం చేసింది.

టన్నెల్ నిర్మాణ పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు,ఇతర అనుబంధ నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు ప్రాజెక్టు కోసం భూములు,ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందించడంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

ADVERTISEMENT

వివరాలు 

సీఎం పర్యటన ఇలా..

ఈ క్రమంలో కేవలం 48 రోజుల్లోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం చెల్లించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం 9.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు.

ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లికి చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదిక వద్దకు వెళతారు.

ఉదయం 10.35 నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభిస్తారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి వెలిగొండకు కృష్ణా జలాలను విడుదల చేస్తారు.

కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు.

ADVERTISEMENT

వివరాలు 

విజయవంతమైన ట్రయల్ రన్

అక్కడ ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి అమరావతికి బయలుదేరుతారు.

వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ ఆదివారం విజయవంతంగా పూర్తయింది.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.54 గంటలకు కృష్ణా జలాలు సొరంగం నుంచి బయటకు వచ్చాయి.

నీరు బయటకు వస్తున్న సమయంలో సైరన్ మోగడంతో అక్కడే వేచి ఉన్న ప్రజలు ఆనందంతో ఈలలు, కేకలు వేస్తూ చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సొరంగం నుంచి కృష్ణా జలాలు బయటకు వచ్చిన దృశ్యాలను పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు తమ వాట్సప్ స్టేటస్‌లుగా పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు.

వివరాలు 

ఫీడర్ కాలువ వద్ద మంత్రుల సందడి

సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చే ప్రదేశాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ట్రయల్ రన్ సందర్భంగా నీరు చేరిన ఫీడర్ కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు బీఎన్ విజయ్‌కుమార్, కందుల నారాయణరెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు అక్కడ సెల్ఫీలు దిగారు.

వివరాలు 

'ఎన్నికల్లో గెలిచిన ఆనందం కంటే ఎక్కువ'

కృష్ణా జలాలు తమ ప్రాంతానికి అందుబాటులోకి వస్తాయని జీవితంలో ఎన్నడూ ఊహించలేదని మార్కాపురం జిల్లా ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి అన్నారు.

వెలిగొండ నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను చూసినప్పుడు ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో కలిగిన ఆనందం కంటే మరింత సంతోషంగా అనిపించిందని వారు పేర్కొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులను పూర్తి చేసిందని, ఈ ప్రాంత ప్రజల కలగా మిగిలిన ప్రాజెక్టును సాకారం చేసిందని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.

ADVERTISEMENT