Ranganayaka Sagar Reservoir: రంగనాయకసాగర్ నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయకసాగర్ జలాశయం నిర్మాణానికి సంబంధించిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దర్యాప్తును ప్రారంభించింది. జలాశయం నిర్మాణంతో పాటు భూసేకరణలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై లోతుగా పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ సమీపంలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మించారు. ఈ పనులకు సంబంధించి వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టు ఇంజినీర్లను తొమ్మిది రకాల ముఖ్య వివరాలు సమర్పించాలని కోరారు.
వివరాలు
కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్(గజ్వేల్)కు లేఖ
ఈ నెల నాలుగో తేదీన విజిలెన్స్ ఎస్పీ శృతకీర్తి, గజ్వేల్‌లో ఉన్న కాళేశ్వరం ప్రధాన ఇంజినీర్‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ ఇన్వెస్టిగేషన్, సర్వే, ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్), ఫీజిబిలిటీ రిపోర్టు, అంచనాలు, ఒప్పందాలకు సంబంధించి పరిపాలన, సాంకేతిక అనుమతులు, మట్టి కట్ట నిర్మాణానికి ఆమోదించిన డిజైన్స్, డ్రాయింగ్స్, జియలాజికల్ ఇన్వెస్టిగేషన్, నీటి లభ్యత వివరాలు, ఒరిజినల్ ఎలైన్‌మెంట్, మార్పు చేసి ఉంటే ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయాలని కోరింది. అదే విధంగా భూసేకరణ, భూసమీకరణ, అటవీ భూముల మళ్లింపు, భూములు ఇచ్చిన వారికి చేసిన చెల్లింపుల వివరాలు కూడా సమర్పించాలని సూచించారు.
వివరాలు
విజిలెన్స్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను సమర్పించిన ప్రాజెక్టు ఇంజినీర్లు
హైపవర్ కమిటీ, రాష్ట్ర స్థాయి స్థిర కమిటీ సమావేశాల నిర్ణయాలు, అంతర్గత అంచనా నివేదికలు, ప్రారంభం నుంచి పనులు పూర్తయ్యే వరకు ప్రధాన ఇంజినీర్, ఉన్నతాధికారుల పరిశీలన నివేదికలు, కార్యాలయ పరస్పర ఉత్తరాలు అన్నీ ఈ నెల ఏడో తేదీ లోగా ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ప్రాజెక్టు ఇంజినీర్లు సంబంధిత పత్రాలను నేరుగా విజిలెన్స్ కార్యాలయంలో సమర్పించినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు మధ్య మానేరు నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మకు నీటి మళ్లింపు పనులపై ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా, తాజాగా రంగనాయకసాగర్ పనులపైనా విజిలెన్స్ దృష్టి సారించింది.