Vijay Cabinet List: తమిళనాడులో తొలగిన రాజకీయ అనిశ్చితి.. విజయ్‌కు చిన్న పార్టీలు మద్దతు.. కేబినెట్ లిస్ట్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు చివరికి తెరపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్‌తో విజయ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పూర్తి మెజార్టీ సాధిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని గవర్నర్ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అయితే చివరికి చిన్న పార్టీల మద్దతుతో విజయ్‌కు కావాల్సిన బలం సమకూరడంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా మార్గం సుగమమైంది. విజయ్‌కు వామపక్ష పార్టీలు, వీసీకే పూర్తి మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో కూటమి బలం 112కు చేరింది. అనంతరం సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతు కూడా లభించడంతో విజయ్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
కొత్త మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చలు దాదాపు పూర్తి
మరికొద్ది సేపట్లో గవర్నర్ అర్లేకర్‌ను కలిసి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల జాబితాను విజయ్ అందజేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొత్త మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చలు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. విజయ్ మంత్రివర్గంలో వీసీకేకు ఒక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కూ కీలక బాధ్యతలు దక్కే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మిత్రపక్షాలతో జరిగిన చర్చల్లో మంత్రి పదవుల అంశంపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
వివరాలు
వీసీకేకు ఒక మంత్రి పదవి, సీపీఐ, సీపీఎంకు చెరో మంత్రి పదవి
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యంపై మిత్రపక్షాల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. వీసీకేకు ఒక మంత్రి పదవి, సీపీఐ, సీపీఎంకు చెరో మంత్రి పదవి ఇవ్వడంపై అంగీకారం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పార్టీలకు అసెంబ్లీలో చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటివరకు డీఎంకే కూటమిలో కొనసాగిన ఈ పార్టీలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వివరాలు
మంత్రివర్గంలోకి వీసీకే అధినేత
తమ రాజకీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను స్టాలిన్ మిత్రపక్షాలకు ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం జరిగిన కీలక చర్చల తర్వాతే ఈ పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. వీసీకే అధినేత తిరుమావలవన్ స్వయంగా మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకే ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.