Tamil Nadu Results: జయలలిత రికార్డు సమం చేసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే చీఫ్, దళపతి విజయ్ జోసెఫ్ అనూహ్య విజయంతో అధికార డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు గట్టి షాక్ ఇచ్చారు. మొత్తం 234 స్థానాలున్న రాష్ట్రంలో టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ ఆయన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తొలి అడుగులోనే రాజకీయ స్థిరత్వం సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేసిన ఆయన, భారీ అభిమానగణాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో విజయవంతమయ్యారని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. రెండు స్థానాల్లో గెలుపొందడం ద్వారా విజయ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రికార్డును సమం చేశారు.
వివరాలు
మూడున్నర దశాబ్దాల తర్వాత విజయ్ కూడా ఇదే రికార్డు
ఇప్పటి వరకు తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక నేతగా జయలలిత మాత్రమే నిలిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1954 ప్రకారం, ఒక అభ్యర్థి ఒకేసారి రెండు స్థానాల్లో పోటీ చేయవచ్చు. అయితే రెండింటిలో గెలిస్తే, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత బర్గూర్, కాంగేయం నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించి, తర్వాత కాంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. సుమారు మూడున్నర దశాబ్దాల తర్వాత విజయ్ కూడా ఇదే రికార్డును పునరావృతం చేశారు. వాస్తవానికి టీవీకే పార్టీ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.
వివరాలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పు
ఎక్కువగా మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే తమిళ ప్రజలు అందరి అంచనాలను తారుమారు చేస్తూ విభిన్న తీర్పునిచ్చారు. కింగ్‌మేకర్‌గా భావించిన పార్టీని నేరుగా కింగ్‌గా నిలబెట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా పూర్తిగా తప్పుబడ్డాయి. దాదాపు అన్ని సంస్థలు డీఎంకే కూటమిదే అధికారమని అంచనా వేయగా, కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే విజయం సాధించే అవకాశాన్ని సరిగ్గా అంచనా వేసింది. ఇంకా ముఖ్యంగా పార్టీ స్థాపించి కేవలం రెండేళ్లలోనే అధికారంలోకి రావడం ద్వారా విజయ్ మరో రికార్డును సృష్టించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించిన ఆయన, ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, పూర్తిస్థాయిలో అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు.