TVK: పెరంబూర్ నుంచి విజయ్ పోటీ? చెన్నైలో టీవీకే వ్యూహం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్న టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. కొడుంగైయూర్‌లో సిద్ధమవుతున్న పార్టీ కార్యాలయం కూడా ఆయన కోసమేనని, పెరంబూర్ నుంచి ఆయన బుధవారం ప్రచారం ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
అభిమానుల మద్దతే కీలకం
శాసనసభ ఎన్నికలకు ముందుగానే చెన్నైలోని 16 నియోజకవర్గాల్లో తమ పార్టీ బలాబలాలను అంచనా వేయడానికి విజయ్ ప్రత్యేక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో విరుగంబాక్కం, వేళచ్చేరి వంటి ప్రాంతాలు ప్రాధాన్యంగా నిలిచినట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల పేర్లు 'వి' అక్షరంతో ప్రారంభమవుతుండటంతో, వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశముందనే ప్రచారం కూడా సాగింది. అయితే, తాజాగా పెరంబూర్‌పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. పార్టీ స్థాపన తర్వాత ఆన్‌లైన్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ నియోజకవర్గం నుంచే ఏకంగా 45 వేల మంది చేరినట్లు తెలిసింది. దీంతో అభిమానుల బలం గట్టిగా ఉన్న ప్రాంతంగా భావించి పెరంబూర్‌ను ఎంపిక చేసుకున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
3,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీవీకే శాసనసభ కార్యాలయం
ఇక కొడుంగైయూర్‌లోని కృష్ణమూర్తినగర్ జవహర్ వీధిలో సుమారు 3,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీవీకే శాసనసభ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. పూర్తి ఎయిర్ కండీషనింగ్ సౌకర్యాలతో పాటు కారు పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యాలయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇది విజయ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న కార్యాలయమని ప్రచారం జరుగుతోంది. పెరంబూర్ నుంచే బుధవారం విజయ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి, రెండు రోజుల పాటు ఓటర్లను ఆకర్షించేందుకు పర్యటన చేపట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బుస్సి ఆనంద్ వంటి కీలక నాయకులు చెన్నైలోని ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం.
వివరాలు
త్వరలో అభ్యర్థుల ప్రకటన
శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ గత రెండేళ్లుగా కసరత్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రధానంగా టీవీకే,డీఎంకే మధ్యే పోటీ ఉండనుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అధికార పార్టీకి గట్టి సవాల్ విసరాలనే ఉద్దేశంతో పార్టీ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దింపేందుకు ప్రణాళిక రూపొందించారు.
వివరాలు
త్వరలో అభ్యర్థుల ప్రకటన
ఆశావహుల నుంచి అందిన దరఖాస్తులను పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేతలు సోమవారం పరిశీలించారు. తొలి విడతలో ఎంపికైన 114 మంది అభ్యర్థులను ప్రధాన కార్యాలయానికి పిలిపించి వారితో చర్చలు జరిపారు. తేనాంపేట్టైలో ఏర్పాటు చేసిన పార్టీ వార్‌రూమ్‌లో ప్రధానకార్యదర్శి బుస్సి ఆనంద్, ఎన్నికల ప్రచార ప్రధాన నిర్వాహకుడు ఆదవ్ అర్జున్ తదితరుల సమక్షంలో కీలక సమావేశం జరిగింది. అభ్యర్థుల పూర్తి జాబితాను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.