
Vijay Mallya: రుణాల రికవరీపై వారు 'సిగ్గుపడాలి'.. భారత బ్యాంకులపై విజయ్ మాల్యా విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ మాల్యా (Vijay Mallya) దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను తీసుకుని పారిపోయి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీ వివరాలను కొన్ని బ్యాంకులు దాచిపెట్టాయనీ, అధికారికంగా వెల్లడించలేదనీ మాల్యా ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే రూ.14,100 కోట్ల వరకు బ్యాంకులు రికవరీ చేసుకున్నట్లు స్పష్టం చేసినప్పటికీ, ఆ వివరాలు బయటపెట్టకపోవడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్యా తన తీసుకున్న రుణాల పూర్తి వివరాలను భారత బ్యాంకులు స్పష్టంగా వెల్లడించేవరకు, యూకేలో తాను ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని తెలిపారు.
వివరాలు
అకౌంట్ స్టేట్‌మెంట్లపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మాల్యా
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకులు అనేక రెట్లు వసూలు చేసుకున్నారని,దానికి సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లు అందించాలని ఆయన పలుసార్లు కోర్టులో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రికవరీ అధికారి కూడా మాల్యా ఇప్పటికే దాదాపు రూ.10,200కోట్లను చెల్లించారని వెల్లడించారు. అయినప్పటికీ, రుణం పూర్తిగా చెల్లించబడినప్పటికీ రికవరీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందుకు మాల్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల విషయంలో మోసం చేసినట్లు మాల్యా మీద ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన మార్చి 2016నుండి బ్రిటన్‌లో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను భారత్‌కు రప్పించడానికి ప్రయత్నిస్తున్నది.అలాగే, తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు వసూలు చేసుకున్నారని,సంబంధిత అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ మాల్యా ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.