Vijay: ప్రభుత్వం దిశగా టీవీకే పార్టీ అడుగులు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో గణనీయ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజారిటీని అందుకోలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై చర్చించేందుకు విజయ్ గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని గవర్నర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. టీవీకే మొత్తం 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతోంది.
వివరాలు
టీవీకే నాయకులతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్న వామపక్ష పార్టీలు
దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలు మళ్లగుళ్లాలు పడుతున్నారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్,పీఎంకే పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. అయితే ఇందుకు ప్రతిగా ఆ రెండు పార్టీలు చెరో రెండు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో వామపక్ష పార్టీలు కూడా టీవీకే నాయకులతో అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీవీకే ఎవరితో చేతులు కలుపుతుందనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా,ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను కలవడానికి విజయ్ ఉదయం 10గంటలకు టీవీకే కార్యాలయానికి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.