Vijay: పత్తి దిగుమతి సుంకం తొలగిస్తేనే వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.. ప్రధానికి విజయ్ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,పరిశ్రమను ఆదుకునేందుకు పత్తిపై విధిస్తున్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. పత్తి, నూలు ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలోని వస్త్ర రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద వస్త్ర, దుస్తుల ఎగుమతి రాష్ట్రంగా తమిళనాడు కొనసాగుతోందని విజయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది మహిళలు ఈ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
వివరాలు
గత రెండు నెలల్లో పత్తి ధర 25 శాతం పెరిగిందని లేఖలో ప్రస్తావన
అయితే ఇటీవల పత్తి ఉత్పత్తి తగ్గడం, వ్యాపార లావాదేవీలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు అమాంతం పెరిగాయని చెప్పారు. దీంతో పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిందన్నారు. గత రెండు నెలల్లోనే పత్తి ధర దాదాపు 25 శాతం పెరిగిందని విజయ్ తన లేఖలో వెల్లడించారు. ఒక క్యాండీ పత్తి ధర రూ.54,700 నుంచి రూ.67,700కు చేరిందని తెలిపారు. అలాగే నూలు ధర కిలోకు రూ.301 నుంచి రూ.330 వరకు పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని, కానీ పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకం పరిశ్రమకు భారంగా మారిందని వివరించారు.
వివరాలు
సుంకం రద్దు చేస్తేనే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని వెల్లడి
వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం వస్త్ర పరిశ్రమేనని విజయ్ గుర్తుచేశారు. ఈ పరిశ్రమను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగిస్తే పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు సులభంగా లభిస్తుందని తెలిపారు. అలాగే విదేశీ ఎగుమతి ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత వస్త్ర రంగం పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోవచ్చని చెప్పారు. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రక్షించబడతాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజయ్ కోరారు.