Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు కరూర్‌లో జరిగిన దళపతి విజయ్ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఈ విషాదంపై విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ అక్టోబర్ 27న చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను వ్యక్తిగతంగా కలవనున్నారు.
Details
టీవీకే ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కజగం (టీవీకే) పార్టీ ఈ సమావేశాన్ని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాల కోసం 50 గదులు బుక్ చేయగా, వారికి సౌకర్యంగా ఉండేందుకు కరూర్ నుంచి మహాబలిపురం వరకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. విజయ్ ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని, తన సంతాపాన్ని తెలియజేయనున్నారు. అయితే, ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విజయ్ స్వయంగా కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించి ఉండాలని భావిస్తుండగా, మరికొందరు భద్రతా కారణాలు, అధికార అనుమతుల నేపథ్యంలో మహాబలిపురంలో సమావేశం నిర్వహించడం సరైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.
Details
ఏం జరిగింది?
సెప్టెంబర్ 27న కరూర్ వేలుచామిపురంలో విజయ్ నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో ఈ విషాదం జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం తరలివచ్చి, తొక్కిసలాట జరిగి 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దీంతో విజయ్ బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా స్పందించి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.