Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం
విజయవాడకు మళ్లీ వరద భయం వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సింగ్‌నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం వంటి ప్రాంతాల్లో 1-2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి పెద్ద వరద ప్రవాహం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారానికల్లా వరద పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత మూడ్రోజులగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్కులు దాటలేదు. బుడమేరు డైవర్షన్ ఛానల్ వరద ప్రవాహం కూడా తగ్గడం విశేషం.
పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
కృష్ణా జిల్లాలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో వరద ప్రవాహం ఉంది. నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో మాత్రం నీటి స్థాయి పెరిగింది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయం 32.66 మీటర్లుగా ఉన్న వరద స్థాయి సాయంత్రానికి 32.56 మీటర్లకు తగ్గింది. 48 గేట్ల ద్వారా 9.76 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.