LOADING...
AP police: ఫిర్యాదు,ఎఫ్‌ఐఆర్‌ నమోదు,రిమాండ్‌ రిపోర్టు తయారీకి.. ప్రత్యేక యాప్‌ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు
ఫిర్యాదు,ఎఫ్‌ఐఆర్‌ నమోదు,రిమాండ్‌ రిపోర్టు తయారీకి.. ప్రత్యేక యాప్‌ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు

AP police: ఫిర్యాదు,ఎఫ్‌ఐఆర్‌ నమోదు,రిమాండ్‌ రిపోర్టు తయారీకి.. ప్రత్యేక యాప్‌ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

కేసుల దర్యాప్తులో సాంకేతికతను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు శాఖ కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ)వైపు అడుగులు వేసింది. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణలో 'అస్త్రం'అనే ఏఐ టూల్‌ను విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు వినియోగిస్తూ ఉత్తమ ఫలితాలను అందుకుంటున్నారు. దీనికొక కొనసాగింపుగా,కేసు నమోదు నుండి ఎఫ్‌ఐఆర్ తయారీ, రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసే వరకు ఏఐ ఆధారిత వ్యవస్థను రూపొందించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు ఆదేశించారు. ఈ కొత్త ఏఐ టూల్ బ్యాక్‌ఎండ్‌లో వివిధ నేరాలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాలు (SOPs),ముఖ్యమైన కోర్టు తీర్పులతో అనుసంధానమవుతుంది. ప్రస్తుతానికి ఈ టూల్‌ను పటమట పోలీస్ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పరీక్షిస్తున్నారు.

వివరాలు 

ఫిర్యాదు దశ నుంచే.. 

అన్ని అంశాలూ విజయవంతంగా అమలవుతాయన్న విశ్వాసం నెలకొంటే, నెల రోజులలోపు విజయవాడ కమిషనరేట్ పరిధిలో దీనిని అమలులోకి తీసుకురానున్నారు. పౌరుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దగ్గర నుంచే ఈ టూల్ పని చేయడం ప్రారంభిస్తుంది. పోలీసులు తమ మొబైల్ లేదా ట్యాబ్‌లో యాప్‌ను ఓపెన్ చేసి రికార్డర్‌ను ఆన్ చేస్తారు. ఫిర్యాదుదారు చెప్పే విషయాలను ఇది రికార్డు చేస్తుంది. ఆడియోని తెలుగుతోపాటు ఇంగ్లీష్‌లోనూ టెక్స్ట్‌గా మార్చుతుంది. దీని ఆధారంగా ఫిర్యాదు ప్రతిని సిద్ధం చేస్తుంది. అలాగే, ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో సూచనలిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించేస్తుంది. అవసరమైతే, మార్పులు, చేర్పులు కూడా తేలికగా చేయవచ్చు.

వివరాలు 

ఘటనాస్థలి సమగ్ర విశ్లేషణ... 

నేరం జరిగిన ప్రదేశాన్ని ఫోటో తీసిన వెంటనే, ఈ టూల్ దాన్ని గమనించి లోతుగా విశ్లేషిస్తుంది. అందులో ఉన్న ఆధారాలు - ఉదాహరణకు, పాద ముద్రలు, వెంట్రుకలు, రేఖలు, పెన్ను, సిగరెట్ పీకలు మొదలైనవి గుర్తించి, వాటిని పరిశీలించి నివేదిక ఇస్తుంది. ఆ ప్రాంత పరిస్థితులను బట్టి నిందితుడు ఎటు వెళ్లాడన్న కోణంలోనూ, ఘటనకు ముందు వాదనలు జరిగాయా? వంటి వివరాలకూ దృష్టిసారించి, దర్యాప్తుదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధంగా క్లూస్‌ టీమ్ చేసే పని చాలావరకు ఇది చెయ్యగలదు. దర్యాప్తులో దృష్టి పెట్టాల్సిన అంశాలను సూచించగల సామర్థ్యం ఈ టూల్‌కు ఉంది.

వివరాలు 

పక్కాగా రిమాండ్‌ రిపోర్టు... 

నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు రిమాండ్‌కు పంపేందుకు అవసరమైన రిపోర్టు చాలా కీలకం. ఈ టూల్ ద్వారా గతంలో యాదృచ్ఛిక నేరాలకు కోర్టులు ఇచ్చిన తీర్పులు, అభిప్రాయాలు, రిమాండ్ విధించిన కేసుల సమాచారాన్ని క్షణాల్లో తీసుకురావచ్చు. వీటన్నింటిని సమన్వయంతో రిమాండ్ రిపోర్టును ఖచ్చితంగా, న్యాయపరంగా లోపరహితంగా తయారు చేస్తుంది. ఈ విధంగా న్యాయస్థానంలో పోలీసుల స్థిరత, నైపుణ్యాన్ని చూపించేందుకు ఇది ఉపయుక్తంగా మారుతుంది.

వివరాలు 

ఇతర అవసరాలకూ.. 

ఒక నేరానికి సంబంధించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలంటే, ఆ లేఖను కూడా ఈ టూల్ సృష్టించగలదు. అవసరమైన వివరాలు మాత్రమే చెప్పినా సరిపోతుంది. వేరే జిల్లాల్లోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన సందర్భాల్లో కూడా ఇది లేఖలను రూపొందించగలదు. అంతేకాకుండా, కస్టడీ పిటిషన్, దర్యాప్తు పొడిగింపు కోరే అర్జీలు, కోర్టులో సమర్పించే మెమోలు, సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు, పంచనామా రిపోర్టు తదితర అవసరాలన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ - "ఈ టూల్‌ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి, సాక్షుల వాంగ్మూలాల నమోదు, నిందితుల ఊహా చిత్రాల తయారీ వంటి అనేక అంశాలకు మరింత విస్తరిస్తాం," అని తెలిపారు.