Vijay: డైలాగ్ నుంచి అధికారానికి విజయ్ ప్రయాణం: తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
ఈ వార్తాకథనం ఏంటి
'తిరిగి వెళ్లే ఆలోచనే లేదు.. నేను వస్తున్నా' అంటూ తన రాజకీయ భవిష్యత్తుపై సంకేతం ఇస్తూ 'జననాయగన్' చిత్రంలో నటుడు విజయ్ చెప్పిన డైలాగ్ ఇది. ఆ మాటలకే తగ్గట్టుగా ఆయన తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి తొలి నుంచే ప్రజల దృష్టిని ఆకర్షించారు. 'అడ్డుకట్టలు వేసి నీటిని ఆపవచ్చు.. కానీ గాలిని ఆపలేరు' అన్న ధైర్యంతో తొలి పరీక్షలోనే తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయ వేదికపై ప్రభావం చూపించారు.
వివరాలు
జనంలో బలమైన మద్దతు..
2024 ఫిబ్రవరిలో 'తమిళిగ వెట్రి కళగం' పేరుతో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రారంభించారు. "రాజకీయాలు నాకు వృత్తి కాదు.. ప్రజాసేవ అనే పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో సినిమాలకు పూర్తిగా వీడ్కోలు పలుకుతూ 'జననాయగన్' తన చివరి చిత్రం అని ప్రకటించడం పెద్ద చర్చనీయాంశమైంది. యువతలో ఆయనకు ఉన్న అభిమానాన్ని బలంగా మలచుకుని, ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.
వివరాలు
అభిమానుల బలం నుంచి రాజకీయ బలం వరకు..
విజయ్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కొత్తది కాదు. 2009లో తన అభిమాన సంఘాలను 'విజయ్ మక్కల్ ఇయక్కమ్'గా సమీకరించారు. ప్రారంభంలో సామాజిక సేవ కార్యక్రమాలకే పరిమితమైన ఈ సంస్థ,2011 ఎన్నికల్లో ఒక కూటమికి మద్దతు ఇచ్చింది. తర్వాతి కాలంలో ఈ సంస్థ రాజకీయ రూపం దాల్చే ప్రయత్నాలు జరిగాయి. కొంతకాలం వివాదాలు జరిగినప్పటికీ, చివరికి అది రద్దయింది. అయితే, ఆ సంస్థకు చెందిన కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గణనీయమైన విజయాలు సాధించారు. దీంతో విజయ్ రాజకీయాలపై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి అధికారికంగా రాకముందే ఆయన సామాజిక అంశాలపై స్పందించారు. 2017లో విద్యావిధానంపై జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. అంతకుముందు తమిళ ప్రజల సమస్యలపై తన మద్దతును ప్రకటించారు.
వివరాలు
వివాదాలు కూడా వెంటనే..
రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే విజయ్ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. కరూర్‌లో జరిగిన సభలో తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం పెద్ద సంఘటనగా మారింది. అలాగే కుటుంబ విషయాలు కూడా వార్తల్లో నిలిచాయి. ఎన్నికల సమయంలో వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యర్థుల ఆయుధాలుగా మారాయి. అంతేకాదు, ఆయన చివరి చిత్రం విడుదలపై వచ్చిన అడ్డంకులు కూడా రాజకీయ చర్చలకు దారి తీశాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ విజయ్ ప్రశాంతంగా వ్యవహరించి, ప్రత్యర్థులపై పదునైన విమర్శలకు బదులు.. తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్లారు.
వివరాలు
హామీలతో ఆకట్టుకున్నారు..
మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పార్టీ హామీలు విజయానికి కీలకంగా మారాయి. ఇంధనంపై సబ్సిడీ, బీమా పథకాలు, మత్స్యకారులకు ఆర్థిక సాయం వంటి అంశాలు ప్రజలను ఆకర్షించాయి. విద్యార్థులకు భారీ స్థాయిలో విద్యా రుణాలు, మహిళలకు నెలసరి ఆర్థిక సహాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెళ్లి కానుకలు వంటి వాగ్దానాలు ప్రజల్లో మంచి స్పందన తెచ్చాయి. కుల గణనపై స్పష్టమైన హామీ ఇవ్వడం, ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేయడం కూడా ఆయనకు మద్దతు పెంచాయి.
వివరాలు
అయ్యారు మరో 'ఎంజీఆర్'..
తమిళనాడులో సినీ నటులకు రాజకీయాల్లో ఉన్న ఆదరణ ప్రత్యేకమైనది. గతంలో ఎంజీఆర్, అన్నాదురై, జయలలిత వంటి నాయకులు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. ఇప్పుడు విజయ్ విజయం ఆ సంప్రదాయాన్ని మరోసారి గుర్తు చేసింది. ముందస్తు అంచనాలు వేరేలా ఉన్నప్పటికీ, తుది ఫలితాల్లో విజయ్ పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆయనను 'మరో ఎంజీఆర్'గా అభివర్ణించే వాదనలు బలపడుతున్నాయి.