Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో కుకీలు కిడ్నాప్ చేసిన మైతీ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమవడం రాష్ట్రంలో తీవ్ర అలజడికి కారణమైంది. ఈ హత్యల నేపథ్యంలో జిరిబామ్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.
ఎమ్మెల్యేల ఇంటిపై దాడి
లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై నిరసనకారులు దాడి చేశారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో సీఎం బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో నివాసం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కైషామ్‌థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్‌ను కలవడానికి నిరసనకారులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని తెలిసిన తరువాత, ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయంపై దాడి చేశారు. నిరసనకారులను శాంతిపరచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హత్యల వెనుక నిందితులను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.