
Waqf Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో హింస.. 110 మంది అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ (సవరణ) చట్టం(Waqf Amendment Act)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం నుండి తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి.
శనివారం నాటికి ఈ ఆందోళనలు మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల వరకు విస్తరించాయి. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విస్తృతంగా దిగ్భందనలు చేపట్టారు.
వారిని నిలువరించేందుకు భద్రతా సిబ్బంది చర్యలు తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లదాడులకు దిగిన నిరసనకారుల కారణంగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనలపై పోలీసులు స్పందిస్తూ, ఇప్పటివరకు 110 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశామని తెలిపారు.
జిల్లా పరిధిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ముర్షిదాబాద్‌లో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని, అలాగే ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు స్పష్టం చేశారు.
Details
పదిమంది పోలీసులకు గాయాలు
శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులను నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆందోళనల సమయంలో జరిగిన ఘర్షణల్లో 10మంది పోలీసులు గాయపడగా, ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడైంది.
అయితే ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల స్పష్టం చేశారు.
ఇక్కడే ఉన్న మైనారిటీలను రక్షించడం తమ బాధ్యత అని, తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను కాపాడతానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.