Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ
గత రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. భద్రతా బలాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో గత కొన్ని వారాలుగా జరుగుతున్న మణిపూర్ అల్లర్లకు సంబంధించి విచారణలు హింసను పెంచేవిధంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. మణిపూర్‌లో హింసను అణిచివేసేందుకు శాంతిభద్రతల యంత్రాంగాన్ని తమ చేతిలోకి తీసుకోలేమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మణిపూర్‌లో మైతీ- కుకీ వర్గాల మధ్య జరుగుతున్న హింసకు సంబంధించిన పిటిషన్‌లను విచారిస్తున్న సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
భద్రత మా పని కాదు: సుప్రీంకోర్టు
రాష్ట్రంలో జరుగుతున్న హింసను మరింత పెంచడానికి సుప్రీంకోర్టు వేదికగా మారకూడదని సీజేఐ అన్నారు. తాము భద్రత, చట్టాన్ని అమలు చేసే యంత్రాగాన్ని నడిపించడం లేదని, కేవలం ఆదేశాలు మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, హింసను అరికట్టేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసినట్లు మణిపూర్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలియజేశారు. మణిపూర్ ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్‌పై తన నిర్మాణాత్మక సూచనలతో కూడిన నోట్‌ను దాఖలు చేయాల్సిందిగా కుకీ గ్రూప్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్‌ను సుప్రీంకోర్టు కోరింది. మణిపూర్ హింసకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.