LOADING...
Supreme Court: మణిపూర్‌లో హింస.. సీఎం ఆడియో టేపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం! 
మణిపూర్‌లో హింస.. సీఎం ఆడియో టేపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం!

Supreme Court: మణిపూర్‌లో హింస.. సీఎం ఆడియో టేపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలతో కొంతకాలంగా రగిలిపోతోంది. హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి ఎన్. బీరెన్‌ సింగ్‌ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఆడియో క్లిప్‌లు లీక్‌ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రభుత్వ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ వ్యాఖ్యలతో సంబంధం ఉన్న ఆడియో టేపులు లీక్‌ అయ్యాయని ఆరోపిస్తూ, కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది.

Details

95శాతం మ్యాచింగ్ అని నివేదిక

పిటిషనర్‌ తరఫున న్యాయవాది కోర్టుకు సమర్పించిన సమాచారం ప్రకారం, ఈ ఆడియో క్లిప్‌లను స్వతంత్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ 'ట్రూత్‌ ల్యాబ్స్‌' పరిశీలించింది. 93 శాతం వరకూ ఈ వాయిస్‌ సీఎం బీరెన్‌ సింగ్‌దే అని తేల్చినట్లు కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న అనంతరం, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 24కి వాయిదా వేసింది.

Details

మణిపుర్‌లో కొనసాగుతున్న హింస 

గత ఏడాదిన్నర కాలంగా మణిపుర్‌లో హింస చెలరేగింది. వివిధ జాతి సంఘర్షణల్లో ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నా హింసని అణచడానికి పూర్తిస్థాయిలో విఫలమవుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై వచ్చిన తాజా ఆరోపణలు ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేశాయి.