Visakh Bay-Tech City: సైబరాబాద్ తరహాలో విశాఖకు మరో నగరం.. బే-టెక్ సిటీగా అభివృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే విశాఖపట్నానికి అనుబంధంగా 'విశాఖ బే-టెక్ సిటీ'ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ప్రణాళికలో భాగంగా యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాంతానికి బే-టెక్ సిటీగా పేరు ఖరారు చేశారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన ప్రణాళికలపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
వివరాలు
64 ప్రాజెక్టులు అమల్లోకి..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖకు ఇరువైపులా ఉన్న విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లోనూ అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో అవసరమైన భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని భూములను సిద్ధం చేయాలన్నారు.
వీఈఆర్ స్టీరింగ్ కమిటీలో నగర మేయర్‌కు స్థానం కల్పించాలని చెప్పారు.
ఈ రీజియన్‌లోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 167 ప్రాజెక్టులు ఉండగా..ఇప్పటికే 64 ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయని అధికారులు వివరించారు.
విశాఖలో ఏడాదిలోగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పోర్టుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని చెప్పారు.
వివరాలు
ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూప్రింట్
ప్రతి పారిశ్రామిక ప్రాంతం సమీపంలో టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 16 పట్టణాలను పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల కోసం రూపొందించిన ప్రణాళికలు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని చంద్రబాబు తెలిపారు.
ఈ మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతోపాటు, ఇప్పటివరకు గుర్తించిన పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేయడమే అభివృద్ధి కాదని, వాటి ద్వారా ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలని చెప్పారు.
వివరాలు
ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూప్రింట్
పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.
మూడు ఆర్థిక ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రణాళికల అమలులో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిటీ ఎకనమిక్ రీజియన్ పథకం కింద 60 ప్రాజెక్టుల కోసం రూ.9,180 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
వీటిని త్వరగా కార్యరూపంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వివరాలు
తిరుపతిని గ్లోబల్ సెమీ కండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలి
తిరుపతిని ప్రపంచస్థాయి సెమీ కండక్టర్ల డిజైన్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు సూచించారు.
ఎలక్ట్రానిక్స్, అంతరిక్ష పరిశోధన, రోబోటిక్స్, డ్రోన్ల వంటి రంగాలకు అవసరమైన డిజైన్, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి పారిశ్రామిక క్లస్టర్లను మరింత బలోపేతం చేయాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించాలని చెప్పారు.
అరుదైన ఖనిజాల వ్యర్థాల నుంచి ఇతర అవసరాలకు ఉపయోగపడే పదార్థాలను వేరు చేసే సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రీన్ ఎనర్జీ, ఉద్యానవన పంటలు, ఖనిజ సంపద ఆధారంగా తిరుపతి ప్రాంతంలో కొత్త పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు.
వివరాలు
తిరుపతిని గ్లోబల్ సెమీ కండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలి
తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో మొత్తం రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండగా.. ఇందులో అత్యధికంగా రూ.5.70 లక్షల కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఉన్నాయని వివరించారు.
హార్టీకల్చర్ హబ్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలను అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.
రానున్న మూడేళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కోరారు.
వివరాలు
అమరావతి ఆర్థిక ప్రాంతానికి పోర్టుల అనుసంధానం
అమరావతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఆక్వా, కోకో, పామాయిల్ రంగాలు ఆర్థిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.
ఈ ప్రాంతంలో ఇప్పటికే రూ.4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు.
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన రవాణా అనుసంధానం కల్పిస్తే ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
క్వాంటమ్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా అమరావతి ప్రాంతానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
అదే సమయంలో తయారీ రంగానికి కూడా అమరావతి కీలక కేంద్రంగా మారుతుందని చెప్పారు.
అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్ల నిర్మాణం పూర్తయితే వాటి చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలు విస్తరిస్తాయని తెలిపారు.
వివరాలు
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిలో ప్రముఖ విద్యాసంస్థలను నాలెడ్జ్ భాగస్వాములుగా నియమించాలని అధికారులకు సూచించారు.
తద్వారా పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం పెరిగి అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆదేశించారు.
అరకుతోపాటు లంబసింగి వంటి ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
రానున్న సీఐఐ సదస్సు సమయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులను ఈ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
వివరాలు
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
తీర ప్రాంతాలను బీచ్ రిసార్టులుగా అభివృద్ధి చేయాలని చెప్పారు.
సూర్యలంక, చినగంజాం, ఓడరేవు, నిజాంపట్నం, దిండి ప్రాంతాల్లో బీచ్, ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు.
సూర్యలంక, గండికోట ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న అవకాశాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం పేర్కొన్నారు.
శ్రీశైలం సహా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
అదేవిధంగా నాగార్జునకొండ, అమరావతి ప్రాంతాలను అనుసంధానిస్తూ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.