Andhra Pradesh: విశాఖకు ఐటీ కళ.. రూ.526 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ.526.25 కోట్ల పెట్టుబడులు పెట్టే 10 ఐటీ ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానుండటంతో నగరం గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదిగే అవకాశాలు పెరిగాయి.
వివరాలు
లోకేశ్ చొరవతో పెట్టుబడులు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ప్రముఖ ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్టులు రాష్ట్ర ఐటీ రంగానికి మరింత ఊతమిస్తాయని పేర్కొన్నాయి.
విశాఖలో డెలాయిట్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ కేంద్రాలు
ఆమోదం పొందిన 10 ప్రాజెక్టుల్లో రెండు ప్రముఖ సంస్థలు విశాఖపట్నంలో తమ కార్యకలాపాల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి.
గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ రూ.43.75 కోట్ల పెట్టుబడితో 2,500 సీట్ల సామర్థ్యం కలిగిన ఆధునిక ఆపరేషన్స్ సెంటర్‌ను నెలకొల్పనుంది.
వివరాలు
5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి
అలాగే ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ.100 కోట్ల పెట్టుబడితో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యకలాపాల కోసం 2,400 సీట్ల సామర్థ్యంతో మరో భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
డెలాయిట్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ కేంద్రాల ఏర్పాటుతో కలిపి దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
మొత్తం 10 ఐటీ ప్రాజెక్టులకు ఆమోదం లభించగా.. వాటిలో ఏడు ప్రాజెక్టులు అత్యాధునిక క్వాంటం టెక్నాలజీకి సంబంధించినవి కావడం విశేషం.
ఈ ప్రాజెక్టుల అమలుతో విశాఖపట్నం ఐటీ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడంతో నగరం ఐటీ, సాంకేతిక రంగాల్లో మరింత కీలక కేంద్రంగా ఎదుగుతుందని భావిస్తోంది.