Page Loader
Vizag: 'డబుల్‌ డెక్కర్‌' తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్టు.. పైన మెట్రో.. కింద వాహనాలు!
'డబుల్‌ డెక్కర్‌' తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్టు.. పైన మెట్రో.. కింద వాహనాలు!

Vizag: 'డబుల్‌ డెక్కర్‌' తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్టు.. పైన మెట్రో.. కింద వాహనాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలోని ట్రాఫిక్‌ రద్దీ, ప్రజల ప్రయాణ అవసరాలు, భవిష్యత్తులో నగరపు రూపురేఖల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రాజెక్టును 'డబుల్‌ డెక్కర్‌' మోడల్‌లో రూపొందించనున్నారు. అంటే.. పైభాగంలో మెట్రో రైలు, దాని కింద భాగంలో సాధారణ వాహనాల రాకపోకలకు మార్గం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా,నగరానికి మధ్యలో నాలుగు లైన్లతో కూడిన పైవంతెనలు ఏర్పాటయ్యే విధంగా ప్రతిపాదన రూపొందించారు. ఈ విధంగా నాలుగు వరుసలపైవంతెనలు,మెట్రో లైన్లను కలిపి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

వివరాలు 

భారీ తగ్గనున్న ఖర్చులు 

దీనితో పాటు, ఆసియా మౌలిక వసతుల,పెట్టుబడుల బ్యాంకు (AIIB) రుణం ఇవ్వడానికి ఆసక్తిని చూపింది. ఈ బ్యాంకు ప్రతినిధులు మెట్రో కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డితో కలిసి విశాఖ పర్యటించటంతో ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం వచ్చింది. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నగరంలోని ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి 12 పైవంతెనలను నిర్మించాలని ప్రణాళిక తయారు చేసింది. ఇవి మధురవాడ నుండి లంకెలపాలెం వరకు ఉండేలా డీపీఆర్‌ రూపొందించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును చేపట్టాలనడంతో,రెండు వేర్వేరు పనులు జరగడం వల్ల స్థల వినియోగం,ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే, మెట్రో,పైవంతెనల నిర్మాణాన్ని కలిపి సంయుక్తంగా చేపడితే స్థల సేకరణ, వ్యయ భారం రెండూ తగ్గుతాయని నిర్ణయించారు.

వివరాలు 

మొదటి దశలో 20 కిలోమీటర్ల డబుల్‌ డెక్కర్‌ ట్రాక్‌ 

ఇలాంటి డబుల్‌ డెక్కర్‌ మెట్రో ఇప్పటికే నాగ్‌పుర్‌లో విజయవంతంగా నడుస్తోంది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించిన సంస్థ నుంచి తగిన సమాచారం సేకరించి, జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర అధికారులు అందజేశారు. ఈ విధంగా, ప్రాజెక్టు ఖర్చును ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్, NHAI కలిసి భరించనున్నాయి. మొత్తం పర్యవేక్షణ బాధ్యతను మెట్రో సంస్థ నిర్వహించనుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం 140.13 కిలోమీటర్ల పొడవుతో రూపొందించనున్నారు. ఇందులో మొదటి దశలో 46.23 కిలోమీటర్లలో మూడు కారిడార్లు నిర్మించనున్నట్టు ప్రతిపాదించారు. ఇందులో 20.16 కిలోమీటర్ల భాగాన్ని డబుల్‌ డెక్కర్‌ మోడల్‌లో నిర్మించనున్నారు. ముఖ్యంగా మధురవాడ నుండి తాటిచెట్లపాలెం వరకు మరియు గాజువాక నుండి స్టీల్‌ప్లాంట్‌ వరకు భారీ వంతెనలు నిర్మిస్తారు.

వివరాలు 

కారిడార్ల సమన్వయం 

ఈ నిర్మాణం పూర్తయితే, కింద రోడ్డు, మద్యలో ఫ్లైఓవర్‌, ఎగువన మెట్రో ట్రాక్‌ ఉండేలా ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే, ఆసియా ఖండంలోనే అతిపొడవైన డబుల్‌ డెక్కర్‌ మెట్రోగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో కొమ్మాది-స్టీల్‌ప్లాంట్‌, గురుద్వారా-పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో కొమ్మాది నుండి స్టీల్‌ప్లాంట్‌ వరకు 34.40 కిలోమీటర్ల కారిడార్‌లో డబుల్‌ డెక్కర్‌ ట్రాక్‌ ఏర్పాటవుతుంది. ముఖ్యంగా మధురవాడ నుండి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కారిడార్‌ను ఎనిమిది వంతెనలను కలిపి ఒకే వంతెనగా NHAIతో కలిసి నిర్మించనున్నారు. అలాగే, గాజువాక నుండి స్టీల్‌ప్లాంట్‌ మధ్య మరొక డబుల్‌ డెక్కర్‌ వంతెన నిర్మాణం కూడా చేపడతారు.