Minister Narayana: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. ఫేజ్-1 కింద రూ.11,498 కోట్లతో 46.3 కి.మీ. మెట్రో
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో ఫేజ్-1 కింద మొత్తం 46.3 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లతో రూ.11,498 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ఇప్పటికే ఆమోదించబడిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు శాసనసభలో మంత్రి సమాధానం ఇచ్చారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం, రాబోయే 30 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని, పీహెచ్‌పీడీటీ (పీక్ హవర్, పీక్ డైరెక్షన్ ట్రాఫిక్) ఆధారంగా మెట్రో మంజూరు చేయబడుతుంది.
కనీసం 10,000 మంది ప్రయాణీకులు ఉండే మార్గాల్లోనే మెట్రో నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.
వివరాలు
ప్రస్తుత గణాంకాల ప్రకారం:
కొమ్మాది నుండి భోగాపురం ఎయిర్‌పోర్టు: 4,137
స్టీల్ ప్లాంట్ నుండి అనకాపల్లి: 3,763
ఎన్‌ఏడీ జంక్షన్ నుండి పెందుర్తి: 4,257
ఓల్డ్ పోస్టాఫీస్ నుండి రుషికొండ: 2,790
రుషికొండ నుండి భీమిలి: 1,534
ఈ మార్గాల్లో ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండటంతో మెట్రో నిర్మాణం సాధ్యం కాకపోవచ్చని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలకు మెట్రో అనుసంధానం చేయాలని సూచిస్తూ, స్టీల్ ప్లాంట్ నుండి అనకాపల్లి వరకు తక్కువ వ్యయంతో లైట్ రైల్ ట్రాఫిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కొణతాల అభిప్రాయపడ్డారు.
వివరాలు
పాత పోస్టాఫీస్ నుండి రుషికొండ
అలాగే, ఎన్‌ఏడీ నుండి పెందుర్తి పాత పోస్టాఫీస్ నుండి రుషికొండ, రుషికొండ నుండి భీమిలి ఈ మార్గాల్లో ట్రామ్ విధానం ద్వారా రవాణా వ్యవస్థ అభివృద్ధి చేయడానికి రూ.5,000 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టవచ్చని కూడా సూచించారు.
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పేదలకు అప్పగించకుండానే, 77,606 మంది లబ్ధిదారుల పేర్లతో రూ.2,275 కోట్ల రుణాలు తీసుకుందని పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ఆరోపించారు.
వివరాలు
'టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మార్పు'
ఈ రుణం పొందిన వారిలో 40,575 మందికి ఇళ్లు మంజూరు చేయలేదని,అయినప్పటికీ వారు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.
ఇలా కాకపోతే,బ్యాంకులు వాటిని ఎన్‌పీఏ (నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్)గా ప్రకటిస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో 'టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మార్పు' పై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.