Page Loader
Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ 
అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ

Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మెట్రో ప్రాజెక్టు "డబుల్ డెక్కర్" మోడల్‌లో నిర్మించనున్నట్లు పేర్కొంటూ, దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వేగంగా నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. బుధవారం రోజున విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

వివరాలు 

15 రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి

ఈ సమీక్షలో రాష్ట్ర శాసనసభాధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేయడానికి 15 రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నామని తెలిపారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల టిడ్కో ఇళ్లను ప్రణాళికలోకి తీసుకున్నప్పటికీ,గత ప్రభుత్వం కేవలం రెండు లక్షల ఇళ్లను కూడా పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు మిగిలిన ఇళ్లను దసరా పండుగ నాటికి లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా,అమృత్ పథకం కింద సుమారు రూ.834 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు.

వివరాలు 

సెమీ రింగ్ రోడ్ నిర్మాణంపై చర్చ

వీఎంఆర్‌డీఏ సమగ్ర ప్రణాళికతోపాటు విశాఖ-కాకినాడ పెట్రో కెమికల్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (వీకేపీసీపీఐఆర్),అలాగే వీఎంఆర్‌డీఏ పరిధిలోకి వచ్చిన విలీన మండలాల అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్‌ను సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంఐజీ లేఅవుట్లు,కొత్త రెసిడెన్షియల్ లేఅవుట్ల ఏర్పాట్లు,అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుండి విజయనగరం జిల్లా భోగాపురం వరకు విశాఖ జిల్లా మీదుగా సెమీ రింగ్ రోడ్ నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తి,వెలగపూడి రామకృష్ణబాబు,విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్,పంచకర్ల రమేష్‌బాబు,అదితి గజపతిరాజు,లోకం నాగమాధవి,కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.