Visakhapatnam Murder Case: ప్రేమ నుంచి హత్య వరకు: మౌనిక హత్య కేసులో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలోని ఎల్.వి.నగర్ ప్రాంతంలో యువతి మౌనిక (29) హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రారంభ విచారణలో కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, లాక్‌డౌన్ సమయంలో చింతాడ రవీంద్రకు డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో రవీంద్ర, మౌనికకు సుమారు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే, తర్వాత డబ్బు కోసం మౌనిక తనను తరచూ ఒత్తిడి చేసేదని, ఆమె వేధింపులను తట్టుకోలేక చివరకు హత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో, రవీంద్ర ఎల్.వి.నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మౌనికను పిలిచాడు.
వివరాలు
గాజువాకలో కత్తులు కొనుగోలు
అక్కడికి చేరుకున్న కొద్ది సేపటికే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ క్రమంగా హింసాత్మకంగా మారి,రవీంద్ర మౌనికను దారుణంగా హతమార్చాడు. ఇదిలా ఉండగా,హత్యకు ముందుగానే రవీంద్ర గాజువాకలో కత్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. హత్య అనంతరం, రక్తపు మరకలను శుభ్రం చేయడంతో పాటు,వాసన రాకుండా ఇంట్లో సెంట్ ఉపయోగించాడు. అనంతరం మౌనిక శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.తలతో పాటు ఆమె మొబైల్ ఫోన్‌ను దారపాలెం ప్రాంతంలోని తోటల్లో తగులబెట్టినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రవీంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఆ స్నేహితుడు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో,చివరకు రవీంద్ర గాజువాక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈకేసు ప్రస్తుతం విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.