Loading...
Vizag: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి

Vizag: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తా, కోడలు ప్రాణాలు కోల్పోయారు. మనవడు, మనవరాలితో సమయం గడపడంతోపాటు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన కుటుంబాన్ని ఈ ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. పోర్షే ఢీకొట్టడంతో.. విశాఖపట్టణం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (VDCA) మాజీ సంయుక్త కార్యదర్శి జీటీ ప్రసాద్ తన భార్య రమాదేవితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన కోడలు బొమ్మలి నేహ టయోటా కరోల్లా కారును నడుపుతుండగా.. ప్రసాద్ మరో కారులో వెనుక ప్రయాణిస్తున్నారు. సెప్టెంబర్ 16, 2026న రాత్రి సుమారు 9:40 గంటలకు బోర్డ్‌వాక్ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫెయిల్ డ్రైవ్ కూడలి మలుపు వద్ద ప్రమాదం జరిగింది.

వివరాలు 

వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్లు

ఈ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్లు కాగా.. ఓ పోర్షే మకాన్ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి నేహ నడుపుతున్న టయోటా కారును బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నేహతోపాటు, పక్క సీటులో కూర్చున్న రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి కారణమైన పోర్షే కారు డ్రైవర్‌కు కూడా గాయాలవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

వివరాలు 

పోలీసుల దర్యాప్తు.. మృతదేహాల తరలింపునకు సహకారం

ఈ ఘటనపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త విశాఖపట్నంలోని ప్రసాద్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు అవసరమైన అధికారిక లాంఛనాల్లో మెల్‌బోర్న్‌లోని తెలుగు సంఘాలు సహకరిస్తున్నాయి.

రమాదేవి కుమారుడు, నేహ భర్త వరుణ్ చంద్ర గున్న.. తన తల్లి, భార్య భౌతిక కాయాలను భారత్‌కు తీసుకురావడానికి 'గోఫండ్‌మీ' (GoFundMe) ద్వారా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ADVERTISEMENT

వివరాలు 

'ఒక్క క్షణంలో నా ప్రపంచం తలకిందులైంది'

సెప్టెంబర్ 16న నేహ, రమాదేవి టయోటా కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంతో తన ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైందని వరుణ్ తన గోఫండ్‌మీ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

"ఒకే ఒక్క విపత్కర క్షణంలో నా జీవిత భాగస్వామిని, అమ్మను కోల్పోయాను" అని పేర్కొన్నారు.

తన 75 ఏళ్ల తండ్రి తులసి ప్రసాద్ జీవితాంతం తోడుగా ఉన్న భార్యను కోల్పోయారని.. తమ ఇద్దరు పిల్లలు హారవ్, విదాన్వి తల్లిని, అమ్మమ్మను కోల్పోయారని వరుణ్ తన బాధను పంచుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

'నేహ మా ఇంటికి వెలుగు, ప్రాణం'

తన భార్య నేహ గురించి వరుణ్ భావోద్వేగంగా వివరించారు. ఆమె తమ ఇంటికి "వెలుగు, ప్రాణం" అని పేర్కొన్నారు.

నేహ దయాగుణం కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారని, నృత్యం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.

ఇటీవల స్థానిక కమ్యూనిటీ సభ్యులతో కలిసి తమ కుమార్తె విదాన్వి తొలి పుట్టినరోజును నేహ ఎంతో ఆనందంగా జరుపుకున్న విషయాన్ని వరుణ్ గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడు ఇద్దరు పిల్లలను సింగిల్ పేరంట్‌గా పెంచడం తన ముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు.

ఈ ఆర్థిక భారాన్ని తాను ఒక్కడినే భరించలేనని పేర్కొంటూ.. క్లిష్ట సమయంలో కమ్యూనిటీ, స్నేహితులు, దాతలు సహాయం చేయాలని కోరారు.

వివరాలు 

మృతదేహాల తరలింపు, కుటుంబ అవసరాల కోసం నిధులు

నేహ, రమాదేవి భౌతిక కాయాలను భారతదేశానికి తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చుల కోసం గోఫండ్‌మీ ద్వారా సేకరించే నిధులను వినియోగించనున్నట్లు వరుణ్ తెలిపారు.

తద్వారా భారత్‌లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.

అలాగే అత్యవసర ప్రయాణ ఖర్చులు, కాన్సులేట్‌కు సంబంధించిన పత్రాల వ్యయాలు, వరుణ్‌, ఆయన 75 ఏళ్ల తండ్రికి అవసరమైన ఖర్చులు, పిల్లలు హారవ్‌, విదాన్వి అవసరాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూడా ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

వివరాలు 

ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం

విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌లో నివసిస్తున్న షిప్‌యార్డు రిటైర్డ్ ఉద్యోగి జీటీ ప్రసాద్.. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు మాజీ సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా సేవలందించారు.

ప్రస్తుతం తన భార్య రమాదేవి, కోడలు బొమ్మలి నేహను రోడ్డు ప్రమాదంలో కోల్పోయి ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తన కళ్లెదుటే భార్య, కోడలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఆస్ట్రేలియా నుంచి మృతదేహాలు విశాఖపట్నానికి చేరుకోవడానికి సుమారు పది రోజులు పట్టే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.

ADVERTISEMENT