Vizag: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ యువతిని హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపుతోంది. గాజువాక 70వ వార్డు పరిధిలోని ఎల్‌బీ నగర్‌లో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రవీందర్ అనే నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని ఇంటికి పిలిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో ఉంచగా, మిగిలిన భాగాలను గోనె సంచిలో దాచినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలు
స్వయంగా లొంగిపోయిన నిందితుడు
ఈ భయానక ఘటన అనంతరం నిందితుడు స్వయంగా గాజువాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో ఈ విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు కుటుంబ సమస్యలు,వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడి భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలిని ఇంటికి పిలిపించుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి పూర్తి వివరాలు,హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ సంఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.