LOADING...
Vizag Metro Rail: యూనిక్ డిజైన్‌తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అక్టోబర్‌లో పనులు ప్రారంభం..
యూనిక్ డిజైన్‌తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అక్టోబర్‌లో పనులు ప్రారంభం..

Vizag Metro Rail: యూనిక్ డిజైన్‌తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అక్టోబర్‌లో పనులు ప్రారంభం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టు వినూత్న శైలిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ నెలలో పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును గరిష్ఠంగా 30 నెలల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో మూడు కారిడార్లు కలిగిన ఈ మెట్రో మార్గం మొత్తం 46.63 కిలోమీటర్ల పొడవున విస్తరించనుంది. ఎన్ఏడీ జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక వంటి ప్రధాన కూడళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లతో పాటు మొత్తం 42 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని యోచన ఉంది.

వివరాలు 

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా మెట్రో 

విశాఖ నగరంలో రద్దీ గల ట్రాఫిక్ సమస్యగా మారింది. ముఖ్యంగా సిటీ మధ్యగా వెళ్తున్న పాత జాతీయ రహదారి నిత్యం భారీ వాహనాల రాకపోకలతో నిండిపోతుంది. ఏటికేడాది వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పది ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. అయితే, మెట్రో నిర్మాణ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశముండటంతో ఆ ప్రణాళికను వదిలేశారు.

వివరాలు 

డబుల్ డెక్కర్ మెట్రో రూపకల్పన 

కారిడార్-1 కింద కొమ్మాది నుండి స్టీల్ ప్లాంట్ వరకు నిర్మించనున్న 34.40 కిలోమీటర్ల మార్గంలో మధురవాడ నుండి తాటిచెట్లపాలెం వరకు 8 ఫ్లైఓవర్లను కలిపి ఒకే బ్రిడ్జ్‌గా నిర్మించనున్నారు. మరో ఫ్లైఓవర్ గాజువాక నుండి స్టీల్ ప్లాంట్ మధ్యలో నిర్మించనున్నారు. మొత్తం 20 కిలోమీటర్ల మేర ఈ మార్గం డబుల్ డెక్కర్‌గా రూపొందనుంది. దీనిలో క్రింది భాగంలో రహదారి, దాని పైన నాలుగు వరుసలలో ఫ్లైఓవర్‌లు, అటుపైన మెట్రో రైలు ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ విధంగా నిర్మాణం పూర్తైతే ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖ మెట్రో గుర్తింపు పొందనుంది.

వివరాలు 

అలైన్‌మెంట్‌లో సవాళ్లు 

మొదటి కారిడార్‌కు అనుమతులు లభించినప్పటికీ, గురుద్వారా జంక్షన్ నుండి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు వెళ్లే మార్గంలో కొన్ని అలైన్‌మెంట్ సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జగదాంబ వంటి ప్రముఖ వ్యాపార ప్రాంతాల మీదుగా ఈ మార్గం వెళ్ళుతుండటంతో, అక్కడ నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్సులు ఉండటంతో భూసేకరణ అవసరం అవుతోంది. మొత్తం 100 ఎకరాల భూమి అవసరం కాగా, వాటిలో 10 ఎకరాలు ప్రైవేట్ యజమాన్యంలోని భూములు. నిబంధనల మేరకు ఈ భూములను సేకరించి, అభివృద్ధి ప్రాజెక్టులో వాటి యజమానులను భాగస్వామ్యులుగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు 

భూసేకరణకు వీఎంఆర్డీఏ పాత్ర 

మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వీఎంఆర్డీఏకి అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కలిపి 1,941.19 ఎకరాల భూమిని సమీకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ భూముల్లో రైతుల నుండి తీసుకునే వాటికి పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వనున్నారు. మిగిలిన భూములను వీఎంఆర్డీఏ అమ్మకానికి పెడుతుంది. ఆ భూముల విక్రయంతో వచ్చే నిధులలో భాగాన్ని మెట్రో ప్రాజెక్టుకు మళ్లించనుంది రాష్ట్ర ప్రభుత్వం.