AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 13,329 గ్రామాల్లో ఓటర్ల జాబితాల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,329 గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. మొత్తం 2,89,07,633 మంది ఓటర్లలో 1,42,29,674 మంది పురుషులు, 1,46,76,527 మంది మహిళలు, 1,432 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16,22,067 మంది ఓటర్లు ఉండగా, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 1,62,407 మంది ఓటర్లు నమోదయ్యారు. జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంస్థ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో ఓటర్ల వివరాలను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంస్థ గత నెలలో పంచాయతీరాజ్ శాఖకు సూచనలు ఇచ్చింది.
వివరాలు
ప్రతి జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్యతో పాటు పురుషులు, మహిళలు, ఇతరుల వివరాలు
మొదట ఈ జాబితాలను మార్చి 9న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, పంచాయతీరాజ్ శాఖ అభ్యర్థనపై గడువును గత నెల 18వ తేదీకి, అనంతరం ఈ నెల 15వ తేదీకి మరోసారి పొడిగించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి అన్ని జిల్లాలలో పంచాయతీ స్థాయిలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రారంభమైంది. ప్రతి జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్యతో పాటు పురుషులు, మహిళలు, ఇతరుల వివరాలను స్పష్టంగా పొందుపరిచారు.
వివరాలు
ఇంకా విడుదల కానీ 22 పంచాయతీలలో ఓటర్ల జాబితాలు
జిల్లా పంచాయతీ అధికారులు ఈ జాబితాలను ధృవీకరించి, రాష్ట్ర ఎన్నికల సంస్థ వెబ్‌సైట్‌లో గురువారం నుంచి నమోదు చేస్తున్నారు. త్వరలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ జాబితాలనే ఆధారంగా తీసుకోనున్నారు. అయితే కోర్టు వివాదాలు మరియు ఇతర సమస్యల కారణంగా 22 పంచాయతీలలో ఓటర్ల జాబితాలు ఇంకా విడుదల కాలేదు. ఆ కేసులు పరిష్కారమైన తర్వాత వాటికి సంబంధించిన జాబితాల విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల సంస్థ ప్రత్యేక ప్రకటన జారీ చేయనుంది.