Panchayat elections: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచి పదవుల కోసం 12,782 మంది, వార్డు సభ్య స్థానాల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 57,22,465 మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Details
పలు చోట్ల వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
రెండో దశలో మొత్తం 4,333గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 415 గ్రామ సర్పంచి పదవులు, 8,307వార్డు సభ్య స్థానాలు ఏకగ్రీవంగా నిర్ణయమయ్యాయి. మరో ఐదు గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే మరో రెండు గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఇవన్నీ మినహాయించి మిగిలిన గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 4,593 మంది రిటర్నింగ్ అధికారులను, 30,661మంది సిబ్బందిని నియమించారు. అలాగే 2,489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 40,626 బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.