NIA:పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ కేరాఫ్ ఉగ్రవాది ఎట్టకేలకు భారత్ అధికారుల చేతికి చిక్కాడు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి పరారైన అతనిని రువాండాలో గుర్తించారు. ఇంటర్‌పోల్ సహకారంతో సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడిని స్వదేశానికి రప్పించారు. ఈ విషయాన్ని గురువారం సంబంధిత అధికారులు వెల్లడించారు. లష్కరే తోయిబా సభ్యుడు సల్మాన్ రెహ్మాన్ ఖాన్ బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు జైళ్లపై ఉగ్రదాడుల కోసం ఆయుధాలు,పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు కేసు నమోదైంది.
నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ
ఈ విచారణను ఎన్‌ఐఏ చేపట్టింది. నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు గుర్తించిన తర్వాత, ఎన్‌ఐఏ, సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించాయి. ఆగస్టు 2న అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. తద్వారా, నవంబరు 27న అతనిని రువాండాలోని కిగాలీ ప్రాంతంలో అరెస్టు చేశారు. తర్వాత అతడిని భారత్‌కు అప్పగించారు. గురువారం నిందితుడిని దేశానికి తీసుకురాగా, ఎన్‌ఐఏ అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.