Amit Shah: UCC అమలు చేస్తాం.. చొరబాటుదారులపై కఠిన చర్యలు: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలోని గోల్‌పారా జిల్లాలోని దుధ్నోయ్‌లో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమల్లోకి వస్తే చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉండదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కలిసి గిరిజనుల అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారని, అది పూర్తిగా అమలవ్వాలంటే బీజేపీకి మళ్లీ అధికారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరారు. మోదీ నాయకత్వంలోనే దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి లభించిందని, కాంగ్రెస్ ఆ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం చారిత్రకమని చెప్పారు. అయితే గిరిజన ప్రాంతాలకు UCC వర్తించదని కూడా స్పష్టం చేశారు.
వివరాలు
కాంగ్రెస్ వస్తే మళ్లీ అస్థిరత
పక్క రాష్ట్రం మేఘాలయలో ఇటీవల జరిగిన ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, గారో హిల్స్ స్వయంప్రతిపత్తి మండలిలో చొరబాటుదారులు గిరిజన మహిళలను పెళ్లి చేసుకుని రాజకీయ ప్రభావం సాధించాలని ప్రయత్నించారని ఆరోపించారు. అస్సాంలో మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే చొరబాటుదారులను పూర్తిగా పంపించేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సాంలో శాంతి నెలకొన్నదని, కానీ కాంగ్రెస్ తిరిగి బలం పెంచుకుంటే మళ్లీ అస్థిరత వస్తుందని హెచ్చరించారు. అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.