
Chandrababu: పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఒక్క ఏడాదిలోనే స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమగ్రంగా తెలియజేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ''ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు జరుగుతున్నాయి. ఎవరు బాగా పనిచేస్తే వారికి ప్రోత్సాహం ఉంటుంది. కానీ పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిని ఎంతటివారైనా ఉపేక్షించమని హెచ్చరించారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకమై ఉండి, వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు.
Details
గత పాలనపై విమర్శలు
గత ప్రభుత్వం పాలనలో రాష్ట్రం తీవ్రంగా వెనుకబడిందని చంద్రబాబు ఆరోపించారు. 'ఆ సమయంలో రాష్ట్రం నిండా నిరాశ, నిస్పృహ, చీకటి అలుముకుంది. ఏపీ పేరు వింటేనే దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఉన్న అసమర్థ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత దిగజార్చిందని అని గుర్తు చేశారు. ప్రజలు ఇక ఆ పాలన భరించలేకే టీడీపీకి తిరుగులేని విజయం అందించారని తెలిపారు.
Details
సమీక్షలు - భేటీలు - సమర్ధ చర్యలు
ప్రతి ఆరు నెలలకొకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సమగ్ర సర్వేలు, నివేదికలు తీసుకుంటామని ప్రకటించారు. మంచి పనికి అభినందన ఉంటే, తప్పులకు ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహిస్తానన్నారు. ఎవరి ఆటంకాలున్నా రాష్ట్ర పునర్నిర్మాణ ప్రాజెక్టులు ఆగబోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Details
సంక్షేమ పథకాలపై దృష్టి - విజయోత్సవాల ప్లాన్
ఈ నెల 12 లేదా 14 లోపే 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జూన్ 12న ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున సాయంత్రం ఎన్డీయే భాగస్వాములు, అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం జరపనున్నారు. వచ్చే నాలుగేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యాచరణపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది.