LOADING...
Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగితే సహించం.. మమతా స్ట్రాంగ్ వార్నింగ్
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగితే సహించం.. మమతా స్ట్రాంగ్ వార్నింగ్

Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగితే సహించం.. మమతా స్ట్రాంగ్ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్స్‌లను తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగితే చావునైనా లెక్కచేయకుండా పోరాడతానని స్పష్టం చేశారు. దక్షిణ కోల్‌కత్తాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను మమతా బెనర్జీ పరిశీలించారు. ఆమె పోటీ చేసిన భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్‌ బాక్స్‌లను ఇక్కడ భద్రపరిచారు.

వివరాలు

ఈవీఎంల నిర్వహణలో భారీ లోపాలు

అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ.. "ఎవరైనా ఈవీఎంలను దొంగిలించడానికి లేదా ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయడానికి ప్రయత్నిస్తే జీవన్మరణ పోరాటం చేస్తాం. జీవితాంతం పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు. ఇక ఉత్తర కోల్‌కతాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను నేతాజీ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. అక్కడ టీఎంసీ నేతలు నిరసనలకు దిగారు. బెంగాల్‌ మంత్రి శశి పంజా, పార్టీ ప్రతినిధి కునాల్ ఘోష్ నేతృత్వంలో ధర్నాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం ఈవీఎంల నిర్వహణలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని టీఎంసీ ఆరోపించింది.

వివరాలు

ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర

భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేసింది. పార్టీల ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్‌ బాక్స్‌లు తెరవబడుతున్నాయని ఆరోపిస్తూ సీసీటీవీ దృశ్యాలను ఎక్స్‌లో పోస్టు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కూడా టీఎంసీ ఆరోపించింది. ఇదిలా ఉండగా టీఎంసీ ఆరోపణలను బీజేపీ సీనియర్‌ నేత తపస్ రాయ్ ఖండించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఎంసీ ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తోందని అన్నారు. తాను కూడా స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించానని, టీఎంసీ ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement