LOADING...
Revanth Reddy: సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ నగరం కేంద్రంగా మారాలని తన ధృఢ సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సన్మాన సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. 'ఐటీ, ఫార్మా రంగాలు ఎలా అభివృద్ధి చెందాయో, ఫిల్మ్‌ ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో ఎదగాలి. మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తాను. హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌లో జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. సినీ కార్మికుల సమస్యల పట్ల తాను అంధుడిలా ఉండనని స్పష్టం చేశారు.

Details

గద్దర్ పేరుతో సినీ అవార్డులు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దం పాటు సినీ అవార్డులు ఇవ్వలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్‌ పేరుతో సినీ అవార్డులు అందజేశామని గుర్తు చేశారు. భారత ఫ్యూచర్‌ సిటీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. అలాగే సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌ స్థాయి పాఠశాల నిర్మించి, నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందించేలా చూస్తామని తెలిపారు. ఆరోగ్య పరంగా కూడా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కల్పించనున్నామని చెప్పారు. అంతేకాకుండా, సినీ కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు డిపాజిట్‌ చేస్తామని ప్రకటించారు.

Details

త్వరలో ఇంటి స్థలాలు కేటాయిస్తాం

సినిమా టికెట్ల ధరల పెంపు ద్వారా లభించే ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు అందేలా జీవో జారీ చేస్తామని చెప్పారు. కార్మికులకు లాభాల్లో 20 శాతం ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే సినీ కార్మికులకు గృహ స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.