
visakhapatnam: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఫ్లాష్ ప్లడ్ ముప్పు: వాతావరణ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయవ్య దిశలో కదులుతోంది. ప్రస్తుతం,ఇది విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అధికారి నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం,ఈ వాయుగుండం ఈ రోజు అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం పారాదీప్ నుంచి గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశముందని సూచించారు. దీని ప్రభావంతో రాబోయే 24గంటల్లో ఉత్తర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం,పార్వతీపురం,మన్యం,విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 20సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.ఫ్లాష్ ఫ్లడ్ (తక్షణ వరద) పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వివరాలు
గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పడే అవకాశమున్నదని తెలిపారు. తూర్పు గోదావరి, యానాం, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయబడింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులకు మూడు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లకూడదని జాగ్రత్తగా సూచించారు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.