
Weather Report: ఒడిశా తీరాన్ని తాకిన వాయుగుండం.. ఉత్తరాంధ్రలో రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం భూభాగాన్ని తాకినట్లు విశాఖపట్టణం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అది వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనమవుతున్నదని అధికారులు వివరించారు. అయినప్పటికీ తీరం దాటిన తర్వాత కూడా వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈరోజు ఉత్తర ఆంధ్ర తీర జిల్లాల్లో భారీ వర్షపాతం ఉండబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం,విజయనగరం జిల్లాల కోసం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా,ఒడిశాలో కురిసిన వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులలోకి చేరుతోంది. దీంతో హిర మండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద సూచన (ఫస్ట్ వార్నింగ్) జారీ చేశారు.
వివరాలు
జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
ఆ బ్యారేజీ నుంచి వంశధార వరద నీటిని క్రమంగా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అలాగే బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మహేంద్రతనయ నదిలో ఉద్ధృతంగా పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌తో పాటు మహేంద్రనగర్ వీధులలోకి వరద నీరు చేరింది. ఈ పరిస్థితుల దృష్ట్యా నదీ పరివాహక గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అదనంగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.