LOADING...
Weather Alert : తుపాను పోయింది… చలి మొదలైంది! తెలంగాణలో కోల్డ్ వేవ్ అలర్ట్
తుపాను పోయింది… చలి మొదలైంది! తెలంగాణలో కోల్డ్ వేవ్ అలర్ట్

Weather Alert : తుపాను పోయింది… చలి మొదలైంది! తెలంగాణలో కోల్డ్ వేవ్ అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కొనసాగిన భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇటీవల మొంథా తుపాన్ ప్రభావంతో రెండు రాష్ట్రాలూ భారీ నష్టాన్ని చూశాయి. లోతట్ట ప్రాంతాల్లోని వాళ్లు వరదనీటితో ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు తుపాను ప్రభావం క్రమంగా తగ్గిపోవడంతో పరిస్థితులు కొంత స్థిరంగా మారుతున్నాయి. వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్రాల ప్రజలపై చలి ప్రభావం తీవ్రంగా పడుతోంది. అకస్మాత్తుగా పెరిగిన చల్లటి గాలుల కారణంగా భయంకర కోల్డ్ వేవ్ నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వివరాలు 

 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని అంచనా 

ప్రత్యేకంగా తెలంగాణలో చలి ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు మూడు రోజుల్లో ఉదయం, రాత్రివేళల్లో ప్రజలు గట్టిగా చలిని అనుభవిస్తున్నారు. ఇక రాబోయే సోమవారం, మంగళవారం, బుధవారం రోజుల్లో చలి తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది. ఈ ఏడాది తెలంగాణలో వర్షాలు రికార్డ్ స్థాయిలో కురిశాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల కారణంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వచ్చే చల్లని గాలులు రాష్ట్రంలోకి చేరడంతో చలి తీవ్రత మరింత పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

నవంబర్ నెలంతా చలి ప్రభావం కొనసాగే అవకాశం

శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పటాన్ చెరులో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత 16.8 డిగ్రీలుగా ఉండాల్సి ఉన్నా, 3.6 డిగ్రీలు పడిపోవడంతో 13.2 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. అదిలాబాద్‌లో 14.2 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 14.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు గుర్తించారు. ఇక నవంబర్ నెలంతా చలి ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ 11 నుంచి 19 వరకు చాలా చల్లని గాలులు వీస్తాయని చెప్పారు. ఇదే సమయంలో, నవంబర్ 13 నుంచి 17 మధ్యలో చలి అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చలి నుంచి రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి 

ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల వరకు పడిపోవచ్చని హెచ్చరిక ఇచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చలి నుంచి రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాతావరణ శాఖ చేసిన ట్వీట్